 
                రాణా కీలక ఉగ్రపాత్రపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కూలంకుషంగా దృష్టి సారించింది. అరెస్టు తర్వాత స్థానిక ఢిల్లీ కోర్టు ముందు రాణా వ్యవహారం గురించి శుక్రవారం ఎన్‌ఐఎ తమ వాదన విన్పించింది. ముంబై ఒక్కటే కాకుండా ఇతర నగరాలు, ప్రాంతాలను కూడా రాణా టార్గెట్ చేసుకున్నాడని, దీనికి సంబంధించి తమ వద్ద పూర్తి సాక్షాధారాలు ఉన్నాయని సంస్థ తమ వివరణలో తెలిపింది.
రాణాను 18 రోజుల ఎన్‌ఐఎ కస్టడీకి ప్రత్యేక న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ ఆదేశించారు. దీనితో ఇక రాణానుంచి టెర్రర్ ప్లాన్‌పై మరింత సమాచారం రాబట్టేందుకు ఎన్‌ఐఎ రంగంలోకి దిగింది. రాణాకు ప్రతి 24 గంటలకు ఓసారి వైద్య పరీక్ష చేయాలి. ఆయన దినం విడిచి దినం తమ లాయర్‌ను కలిసేందుకు వీలు కల్పించాలని కూడా జడ్జి సూచించారు.
రాణా దాడుల వ్యూహం చాలా విస్తృతంగా ఉంది. పలు ప్రాంతాలకు విస్తరించుకుని ఉంది. దీనితో ఆయనను దేశంలోని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లాల్సి ఉందని దర్యాప్తు సంస్థ అధికారులు న్యాయమూర్తికి తెలిపారు. దీనితో ఇకపై రాణాను పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి , క్షేత్రస్థాయిలో విచారించేందుకు వీలుంటుంది. భారీ స్థాయి కుట్ర కోణం ఇమిడి ఉంది. దీనిని సమగ్ర రీతిలో వెలుగులోకి తీసుకురావాల్సి ఉంటుంది.
రాణా కీలక పాత్రధారి అయినప్పటికీ, అతని వెనుక ఉన్న ఇతర శక్తులను ప్రత్యేకించి పాకిస్తాన్ పాత్రను వెలుగులోకి తీసుకురావల్సి ఉంటుంది. ఈ దిశలో నియా చాలా వరకు సాక్షాలను రాబట్టుకుంది. ఇంతకాలం పాక్ పాత్ర గురించి భారత దర్యాప్తు సంస్థలు చెపుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ముంబై కుట్రధారు విచారణకు అందుబాటులోకి రావడంతో ఇకపై అతని ద్వారా పాకిస్థాన్ పాత్ర గురించి మరింతగా వివరాలను రాబట్టుకునేందుకు వీలుంటుంది.
ఇక ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ ఒక ప్రత్యేకమైన ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో ఇద్దరు ఐజీలు, ఐజీ, ఎస్పీతో సహా 12 మంది అధికారులు ఉంటారు. వాళ్లకు మాత్రమే రాణాను ఉంచిన సెల్కు వెళ్లే అనుమతి ఉంటుంది. దర్యాప్తు సమయంలో ముంబయి దాడులకు సంబంధించి సేకరించిన వాయిస్ మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు, ఈమెయిల్తో ఉగ్రవాద దాడులకు సంబంధించి కీలకమైన ఆధారాలను రాణాను చూపిస్తారని ఓ అధికారి తెలిపారు.
అంతేకాకుండా ఈ దాడిలో మిగిలిన వాళ్ల పాత్ర గురించి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. 17 సంవత్సరాల క్రితం నాటి పరిణామాలను ఆరా తీయాల్సి ఉంటుంది. ముంబైలో వినియోగించుకున్న దాడి వ్యూహాలను ఇతర నగరాలలో కూడా అమలు చేసేందుకు రాణా బృందం వ్యూహరచన చేసినట్లు ఎన్‌ఐఎ పేర్కొంది. దీనికి సంబంధించి న్యాయమూర్తి ఎదుట వాదన కీలకం అయింది.
రాణా సెల్‌లో అనేక అంచెల డిజిటల్ భద్రత వ్యవస్థలు ఏర్పాటు చేశారు. వాటిలో ప్రతి అంగుళాన్ని పసిగట్టే సిసిటివి కెమెరాలు ఉన్నాయి. 12 మంది నిర్దేశిత ఎన్‌ఐఎ అధికారులను మాత్రమే లోనికి వెళ్లనిస్తారు.





More Stories
బీహార్ ఎన్నికల ఎన్డీయే మేనిఫెస్టోలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం