బీజేపీ, అన్నాడీఎంకే మధ్య కుదిరిన పొత్తు

బీజేపీ, అన్నాడీఎంకే మధ్య కుదిరిన పొత్తు
* ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి
 
అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో పళనిస్వామి నేతృత్వంలో తమ కూటమి పనిచేస్తుందని చెప్పడం ద్వారా పళనిస్వామి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని సంకేతం ఇచ్చారు. 
 
ఎన్డీఏ భాగస్వామ్యం ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని తనకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కాగా, ఎఐఎడిఎంకె అంతర్గత వ్యవహారాలలో బిజెపి జోక్యం చేసుకోదని అమిత్ షా తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేతో ఎలాంటా షరతులు, డిమాండ్లు లేకుండానే పొత్తులు కుదుర్చుకున్నట్టు అమిత్‌షా చెప్పారు. 
 
అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చోసుకోమని, పొత్తుల వల్ల అటు ఎన్డీయేకు, అన్నాడీఎంకే కూడా లబ్ధి చేకూరనుందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విజన, నీట్ అంశాలపై అడిగినప్పుడు, అన్నాడీఎంకేతో ఈ అంశాలపై చర్చిస్తామని, అవసరమైతే కనీస ఉమ్మడి ప్రోగ్రాం ఉంటుందని చెప్పారు.
డీఎంకే అవినీతి, శాంతిభద్రతల పరిస్థితి, దళిత మహిళలపై అకృత్యాలు వంటి అంశాలపై వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పునివ్వనున్నారని అమిత్‌షా పేర్కొన్నారు. డీఎంకే హయాంలో రూ.39,000 కోట్ల లిక్కర్ స్కామ్, ఇసుక మైనింగ్ స్కామ్, ఎల్కాట్ స్కామ్, ట్రాన్‌పోర్ట్ స్కామ్, మనీ లాండరింగ్ స్కామ్‌లు చోటుచేసుకున్నాయని, తమిళనాడు ప్రజలకు డీఎంకే, ఉదయనిధి స్టాలిన్, స్టాలిన్‌ సమాధానమివ్వాలని స్పష్టం చేశారు.

అన్నాడీఎంకే 1998 నుండి ఎన్డీఏలో భాగంగా ఉందని, ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి జె జయలలిత గతంలో కలిసి పనిచేశారని కూడా షా గుర్తు చేశారు. అయితే, మళ్లీ కలిసి పని చేసేందుకు ‘ఇంత సమయం ఎందుకు పట్టింది? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ  ఈ కూటమి ఇకపై శాశ్వతంగా ఉంటుందని, అందుకే సమయం పట్టిందని చెప్పారు.

అన్నామలై స్థానంలో తమిళనాడులో కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్‌ను నియమించిన రోజే పొత్తులపై ప్రకటన రావడం విశేషం. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చేలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని పార్టీ బీజేపీతో జతకట్టి రాష్ట్రంలోని 39 సీట్లలో 30 సీట్లను గెలుచుకుంది. 

అయితే, తర్వాతి సంవత్సరమే ఏఐఏడీఎంకే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. 2004 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. ఏఐఏడీఎంకే కేవలం ఒక సీటును గెలుచుకోగా, బీజేపీకి ఒక్క సీటు దక్కలేదు. కేంద్రంలో ఎన్డీయే పాలన ముగియడంతో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. జయలలిత శకం తర్వాత, ఏఐఏడీఎంకే 2021 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి కేవలం 75 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2023లో ఈ కూటమి ముక్కలైంది.