ఆప్ఘాన్‌ పురుషులపై తాజాగా తాలిబన్ల ఆంక్షలు

ఆప్ఘాన్‌ పురుషులపై తాజాగా తాలిబన్ల ఆంక్షలు
 
అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. 2021 ఆగ‌స్టులో ఆఫ్ఘాన్‌ ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా పాలకుల ఆంక్షల వల్ల ఆఫ్ఘాన్‌ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
ఇప్పుడు పురుషులు కూడా ఆ జాబితాలోకి వచ్చి చేరారు. ఆప్ఘాన్‌ పురుషులపై అక్కడి పాలకులు పలు ఆంక్షలు విధించినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఆధునిక పోకడలకు పోయి జుట్టును అందంగా కత్తిరించుకున్న పురుషులు ఇక ఊచలు లెక్కపెట్టాల్సిందేనంట.
 
జుట్టును కత్తిరించుకున్న వాళ్లే కాదు, వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, క్షవరం, సంగీతం, పండుగ రోజుల్లో సందడిపై గతేడాది ఆగస్టులో తాలిబన్‌ పాలకులు ప్రత్యేక నియమావళి విడుదల చేశారు. ఆ నియమావళి ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం చూపకూడదు. బిగ్గరగా మాట్లాడకూడదు.దీనిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం 3,300 మంది ఇన్‌స్పెక్టర్లను నియమించింది. అరెస్ట్ అయిన వారిలో ఎక్కువమంది గడ్డాన్ని నిర్దిష్ట రీతిలో కత్తిరించుకోని, క్షవరం చేయించుకోని పురుషులు, వారి క్షురకులే ఉండటం గమనార్హం. అంతేకాదు, రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా నమాజ్ చేయని వారిని కూడా అక్కడి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.