మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు

మమతా బెనర్జీకి కోర్టు ధిక్కార నోటీసు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిక్కుల్లో పడ్డారు. రాష్ట్ర స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) రిక్రూట్‌మెంట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బహిరంగంగా విమర్శించడంపై ఆమెకు కోర్టు ధిక్కార నోటీసు జారీ అయింది. స్వచ్ఛంద సంస్థ ‘ఆత్మదీప్’ తరఫున న్యాయవాది సిద్ధార్థ్ దత్తా ఈ నోటీసులు జారీ చేశారు. 
ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ 26,000 మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్ధించింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 8న బహిరంగంగా మమతాబెనర్జీ తప్పుపట్టడం అత్యున్నత న్యాయస్థానానికి ఉన్న అథారిటీని బలహీనపరచడమేనంటూ ఆమెకు పంపిన నోటీసులో స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. 
 
సుప్రీంకోర్టుకున్న అధికారాలను ఉద్దేశ్యపూర్వకంగా ధిక్కరించినట్టు స్పష్టమవుతోందని, తీర్పును వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ప్రోత్సహించే విధంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఈ నోటీసు పేర్కొంది. కాగా, 26,000 మంది టీచర్ల నియమకాల రద్దును మమతా బెనర్జీ ఇటీవల సవాలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
“ఎవరి ఉద్యోగమైనా ఊడబెరికే హక్కు ఎవరికుంటుంది? ఎవరికీ ఉండదు. మా ప్లాన్ ‘ఏ’ రెడీగా ఉంది, బి,సి,డి,ఈ కూడా రెడీగా ఉంది. ఈ మాట అన్నందుకు నన్ను జైలులో పెట్టొచ్చు. అయినా ఖాతరు చేయను” అని మమతా బెనర్జీ అన్నారు. కోర్టు నిర్ణయం వెనుక “కుట్ర” ఉందని కూడా ఆరోపించారు. విద్యావ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యమని, అర్హులైన టీచర్లను దొంగలు, అనర్హులుగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు.