
ముంబై ఉగ్రదాడి కుట్రదారులలో ఒకడైన తహవూర్ రాణాను అమెరికా ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది. తీహార్ కేంద్ర కారాగారంలో అతడిని ఉంచనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టులో తహవూర్ విచారణను ఎదుర్కొంటాడని వారు చెప్పారు. నిఘా అధికారులు, దర్యాప్తు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తహవూర్ రాణాను తీసుకుని ప్రత్యేక విమానంలో అమెరికా నుంచి బయల్దేరింది.
బుధవారం ఉదయం 7.10 (భారతీయ కాలమానం) గంటలకు బయల్దేరిన విమానం గురువారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటుందని వారు చెప్పారు. రాణా ఢిల్లీలో దిగిన వెంటనే ఎన్‌ఐఏ అతడిని అధికారికంగా అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలిస్తుంది. రాణా తరలింపు దృష్ట్యా తీహార్ జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
రాణాను తీసుకు రావడం నరేంద్ర మోదీ దౌత్యంకు గొప్ప విజయం అని హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. భారత దేశ గౌరవంకు, భూభాగంకు, ప్రజలకు హాని తలపెట్టినవారిని చట్టం ముందుకు తీసుకు రావడం పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా పేర్కొన్నారు.2008లో ముంబై ఉగ్రవాద దాడి సమయంలో విచారణ ఎదుర్కోవడానికి రాణాను భారతదేశానికి తీసుకు రాలేకపోయారని అంటూ పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అమిత్ షా విమర్శించారు. బుధవారం కూడా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో సమావేశమై సన్నాహాలను చర్చించారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ఎన్ఐఏ డైరెక్టర్ సదానంద్ డేటే కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత అర్థరాత్రి, హోంమంత్రిత్వ శాఖ మూడు సంవత్సరాల పాటు విచారణ నిర్వహించడానికి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
కాగా, ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ రాబట్టిన కీలక విషయాలను ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. 2008 ముంబై ఉగ్రదాడికి ముందు రాణాతో పాకిస్థాన్-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ టచ్‌లో ఉండేవాడని ఎన్‌ఐఏ తెలిపినట్లు ఆ మీడియా పేర్కొంది. 26/11 దాడికి ముందు ఎనిమిది సార్లు హెడ్లీ భారత్‌కు వచ్చాడని, ఆ సమయంలో 231 సార్లు అతను రాణాతో సంప్రదింపులు జరిపాడని ఆ మీడియా సంస్థ తన కథనంలో తెలిపింది.
దాడులకు ముందు 2006 సెప్టెంబర్ 14న హెడ్లీ తొలిసారి భారత్‌కు వచ్చి రెక్కీ నిర్వహించాడని.. అప్పుడు 32 సార్లు రాణాతో మాట్లాడాడని పేర్కొంది. హెడ్లీ భారత్‌కు వచ్చినప్పుడల్లా.. రాణాతో ఒకసారి 23 సార్లు, మరోసారి 40 సార్లు, ఇంకోసారి 66 సార్లు.. ఇలా చాలాసార్లు మాట్లాడినట్లు తెలిపింది. దాడులకు సంబంధించిన ప్రాంతాల ఎంపికలో హెడ్లీకి రాణా ఎలా సహకరించాడో ఎన్‌ఐఏ పత్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని వెల్లడించింది.ఇదిలావుంటే ముంబై దాడుల మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు అంతకుముందే పరిచయముంది. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో రాణాకు హెడ్లీ పరిచయమయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీలో రాణా హస్తం ఉంది.
More Stories
స్వతంత్ర దర్యాప్తు జరిపేవరకు జైల్లోనే ఉంటా
కరూర్ తొక్కిసలాట వెనుక కుట్ర… బిజెపి ఆరోపణ
దగ్గు మందుతో చిన్నారుల మృతికి కారణమైన డాక్టర్ అరెస్ట్