తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు ఆమోదం

తిరుపతి – కాట్పాడి లైన్ డబ్లింగ్ కు ఆమోదం

కేంద్ర మంత్రివర్గ భేటీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తిరుపతి – కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ కు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా తిరుపతి, శ్రీ కాళహస్తికి వచ్చే ప్రయాణీకులతో పాటుగా విద్య, వైద్య సంస్థలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతానికి లబ్ది కలగనుంది. కేంద్రం మంత్రివర్గ భేటీలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు రూ.1,332 కోట్లతో డబ్లింగ్‌ పనులకు ఆమోదం లభించింది.

ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట క్షేత్రాలకు లక్షల్లో భక్తులు తరలి వస్తారని చెప్పారు. తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య హబ్‌లుగా ఉన్నా యని అన్నారు. దీనితో రాయలసీమ రీజియన్‌కు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. 
 
అదే విధం గా ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, స్టీల్‌ తయారీ కంపెనీలకు కూడా లబ్ధి పొందుతాయని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. తాజాగా ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాకు లబ్ధి చేకూరు తుందని అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో 17 మేజర్‌, 327 మైనర్‌ వంతెనలు వస్తున్నాయని చెప్పారు. 
 
అదేవిధంగా 7 పైవంతెనలు, 30 అండర్‌ పాస్‌ బ్రిడ్జ్‌లు రానున్నట్లు తెలిపారు. 104 కి.మీ మార్గం రోడ్డుకు బదులు రైలు మార్గానికి రద్దీ మళ్లుతుందని వివరించారు. తద్వారా 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా 4 కోట్ల లీటర్ల డీజిల్‌ పొదుపు అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే సర్వే రిపోర్టులు పూర్తి కావటం..ఇక, ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర పడటంతో త్వరలోనే డబ్లింగ్ కు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది.