తప్పు చేసినవారి బట్టలూడదీస్తాం.. పోలీసులకు జగన్ హెచ్చరిక 

తప్పు చేసినవారి బట్టలూడదీస్తాం.. పోలీసులకు జగన్ హెచ్చరిక 
* పోలీస్ యూనిఫామ్ ఎవరో  ఇచ్చింది కాదన్న ఎస్పీ
 
తప్పు చేసిన వారి బట్టలూడదీస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై మరోసారి తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. వారు ఎక్కడున్నా వదలిపెట్టనని, యూనిఫాంలు తీయిస్తానంటూ హెచ్చరించారు. వడ్డీతో సహా లెక్కేసి వారిని దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పటి బిహార్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోపించారు. 
 
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బలం లేకున్నా హింసా రాజకీయాలు చేసిందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆక్షేపించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు.  కాగా, పోలీసులపై వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
జగన్‌ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అ‌ధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. చట్టపరిధిలోనే పోలీసులు పనిచేస్తున్నారని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

తొమ్మిది నెలల క్రితమే ప్రజలు వైఎస్ జగన్ మోహన్రెడ్డి బట్టలు ఊడదీశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు పోలీసుల బట్టలు ఊడతీసి కోడతామని ఆయన అనడం మానసిక స్థితికి అద్దం పడుతోందని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణం నెలకొందని తెలిపారు.

మరోవైపు తాము అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు విప్పిస్తామని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ రత్న స్పందిస్తూ పోలీస్ యూనిఫామ్ ఎవరో తమకు ఇచ్చింది కాదని, తాము కష్టపడి సాధించామని చెప్పారు. ఒకవేళ పోలీసులు తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. 

తామంతా నిబద్ధతతో పని చేస్తున్నామని, ఎవ్వరికీ అనుకూలంగా వ్యవహారించడం తేల్చి చెప్పారు. కాగా, హెలీప్యాడ్ వద్ద పోలీసులు భద్రత కల్పించలేదని వైసీపీ చేసిన ఆరోపణలను కొట్టిపారేసారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

వైసీపీ నేతలకు చెప్పినా వినకుండా కార్యకర్తలను పెద్దఎత్తున సమీకరించడంతో హెలిప్యాడ్ వద్ద భారీగా జనం గుమిగూడారని చెప్పారు. హెలిప్యాడ్ వద్ద మెుదట 150 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని, ఆ తర్వాత కార్యకర్తలు ఎక్కువగా రావడంతో మరో 100 మందితో భద్రత పెంచామని తెలిపారు. హెలిపాడ్ వద్ద వైపునకు ఒకేసారి భారీగా వైసీపీ కార్యకర్తలు రావడంతో చిన్నపాటి తోపులాట జరిగిందని చెప్పారు.

హెలీప్యాడ్ వద్ద కొంతమంది ఛాపర్ డోర్ లాగడంతో అది దెబ్బతిన్నదని, దీంతో పైలట్లు వీవీఐపీని తీసుకెళ్లలేమని తేల్చి చెప్పారని తెలిపారు. దీంతో వైఎస్ జగన్ రోడ్డుమార్గం ద్వారా బెంగళూరు పయనమయ్యారని పేర్కొన్నారు. హెలిప్యాడ్‌పై ఎక్కడా రాళ్లు కానీ, కర్రలు కానీ వేయలేదని, ఈ విషయాన్ని పైలట్ కూడా ధ్రువీకరించారని స్పష్టం చేశారు. 

జగన్ పర్యటనకు భారీగా బందోబస్తు కల్పించామని పేర్కొంటూ పోలీసులను రెచ్చగొట్టేందుకు కొంతమంది కవ్వించినా వారెక్కడా సహనం కోల్పోలేదని,  పోలీసులంతా సంయమనంతో వ్యవహరించారని తేల్చి చెప్పారు.