
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్’ (ఒపిటి) కార్యక్రమం రద్దు ఉద్దేశంతో అమెరికాలో ప్రతిపాదించిన కొత్త బిల్లు అక్కడ ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో విస్తృత స్థాయిలో భయాందోళనలు కలిగిస్తోంది. యుఎస్ విశ్వవిద్యాలయాల్లో ప్రస్తుతం మూడు లక్షల మంది భారతీయ విద్యార్థుల పేర్లు నమోదై ఉండడంతో, వారిలో అనేక మంది తమ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పిజి) అవకాశాల గురించి అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు.
అంతర్జాతీయ విద్యార్థులను, ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమేటిక్స్) రంగాల్లో ఉన్నవారు పట్టభద్రులైన తరువాత మూడు సంవత్సరాల వరకు యుఎస్‌లో పని చేయడానికి ఒపిటి కార్యక్రమం అనుమతిస్తుంది. తాత్కాలికంగా పని చేసేందుకు అధికారం ఇవ్వడం వల్ల విద్యార్థులు పారిశ్రామిక అనుభవాన్ని గడించి, విద్యా రుణాలను తిరిగి తీర్చగలగడమే కాకుండా, హెచ్1బి వీసా మార్గం ద్వారా దీర్ఘకాలిక ఉద్యోగం సంపాదించే అవకాశాలు మెరుగు అవుతాయి.
వలసదారుల వ్యతిరేక సెంటిమెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లు ఒపిటి రద్దును నిర్దేశిస్తోంది. హెచ్1బి వీసా పొందకపోతే తమ డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు యుఎస్ నుంచి నిష్క్రమించడాన్ని బిల్లు తప్పనిసరి చేస్తుంది. హెచ్1బి లాటరీ ఆధారిత విధానం, వార్షిక పరిమితి దృష్టా తాము వీసా పొందలేకపోవచ్చునని అనేక మంది భయపడుతున్నారు.
మరోవంక, అతి వేగంగా వాహనం నడిపినందుకు లేదా సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టినందుకు వీసాలు రద్దు చేస్తున్నారని కొంత మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల విద్యార్థులు చిన్న పొరపాటు జరిగినా తమ భవిష్యత్తు అంధకారబంధురం అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
కాగా, అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ యంత్రాంగం తక్షణమే దేశం విడిచి వెళ్లాలని, లేదంటే చర్యలు తప్పవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నుంచి ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఆదేశాలు వచ్చిన తర్వాత దేశాన్ని వీడకుంటే రోజుకు రూ. 86 వేల జరిమానా విధించనున్నారని, జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నారని తెలుస్తోంది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ విభాగం అభివృద్ధి చేసిన సీబీపీ వన్ యాప్ ద్వారా 2023 జనవరి నుంచి 9 లక్షల మందికిపైగా వలసదారులు అమెరికాలో ప్రవేశించారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా