
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవంలో సీతమ్మ వారికి తాళిబొట్టు కట్టి కలకలం రేపారు. రాములోరి కళ్యాణంలో విరూపాక్షి పాల్గొన్న సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలూరు నియోజకవర్గంలోని సొంత ఊరు చిప్పగిరిలో జరిగిన రాములోరి కళ్యాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సీతమ్మకు ఎమ్మెల్యే విరుపాక్షి ఎలా తాళి కడతారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే విరూపాక్షి రాములోరి కళ్యాణంలో పాల్గొని సీతమ్మకు తాళికట్టిన వీడియో వైరల్ అవుతోంది.
ఇందులో విరూపాక్షి పంతులుగారి సమక్షంలోనే భాజాభజంత్రీల మధ్య ఇలా సీతమ్మకు తాళి కడుతున్నట్లు కనిపించింది. దీంతో అక్కడే ఉన్న వారంతా ఆయన్ను ఎందుకు వారించలేదనే చర్చ జరుగుతోంది. అలాగే ఆయన తాళి కట్టిన తర్వాత అయినా వారు గుర్తించలేదని అర్థమవుతోంది. అక్కడికి వచ్చిన భక్తులు కూడా ఈలలు వేస్తూ ఈ కార్యక్రమంలో సందడి చేసినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి.
దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎమ్మెల్యే విరూపాక్ష మీడియా వేదికగా సంజాయిషీ ఇచ్చారు. తెలియక చేసిన తప్పు అని, పండితులు చెప్పిన ప్రకారం తాను చేశానని, ఉద్దేశపూర్వకంగా చేయలేదని సంజాయిషీ ఇచ్చుకున్నారు. సామాన్య భక్తుడిగానే గుడికి వచ్చారని, సీతారాముల కల్యాణం జరుగుతుండగా పండితుల సూచన మేరకు మాంగళ్యం సీతమ్మవారి మెడలో వేశానని తెలిపారు.
ఇలా చేయడం తప్పేనని ఎమ్మెల్యే ఒప్పుకుంటూ క్షమాపణ చెబుతున్నట్లు ఓ వీడియో విడుదల చేశారు. దీంతో హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు శాంతించారు. ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని హితవు చెప్పారు.
శ్రీరామనవమి సందర్భంగా విరూపాక్షి స్వగ్రామం చిప్పగిరిలోని కొండావీధిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రాములోరి కల్యాణం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే హోదాలో విరూపాక్షి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా విరూపాక్షి చేతికి వేద పండితులు మంగళసూత్రాన్ని ఇవ్వగా ఆయన దానిని సీతమ్మ మెడలో కట్టేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీతమ్మ మెడలో వేద పండితులు కట్టాల్సిన తాళిని విరూపాక్షి ఎలా కడతారంటూ పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు