
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల వేటు ప్రపంచ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. వరుస నష్టాలతో ఇప్పటికే కుదేలైన మార్కెట్లు సుంకాల ప్రకంపనలతో సోమవారం మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. అమెరికా, యూరప్, ఆసియా స్టాక్ ఎక్స్ఛేంజిలు భారీ నష్టాలను చవి చూశాయి.
ఈ ప్రభావంతో దలాల్ స్ట్రీట్‌లోనూ అమ్మకాల వెల్లువ చోటుచేసుకుంది. ఒక్క పూటలో ఓ దశలో దాదాపు రూ.20 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్‌ఇ సెన్సెక్స్ ప్రారంభంలో 4000 పాయింట్లు పతనమైంది. తుదకు 2,227 పాయింట్లు లేదా 2.95 శాతం పతనమై 73,137కు దిగజారింది. ఇంట్రాడేలో 71,425.01 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ రోజంతా నష్టాల్లోనే కదలాడింది.
ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 742 పాయింట్లు లేదా 3.24 శాతం నష్టంతో 22,161కి పడిపోయింది. అన్ని రంగాల సూచీలు నష్టాలు చవిచూశాయి. ఐటి, లోహ, రియాల్టీ, ఆటో, ఫైనాన్షియల్ రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్-30లో కేవలం ఒకే ఒక్క సూచీ హిందుస్థాన్ యూనిలీవర్ మాత్రం స్వల్పంగా పెరగ, మిగతా అన్నీ నేలచూపులు చూశాయి.
బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.14 లక్షల కోట్లు ఆవిరై రూ.389 లక్షల కోట్లకు పరిమితమైం ది. ఈ ఒక్క మార్చిలోనే మదుపర్ల సంపద ఏకంగా రూ.30 లక్షల కోట్లు హరించుకుపోయింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.63 శాతం, 3.88 శాతం చొప్పున పతనమయ్యాయి. భారీ నష్టాలతో మదుపర్లు లబోదిబోమన్నారు.
గడిచిన పది నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒక్క రోజులో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇక ప్రపంచ మార్కెట్లు కూడా ఘోరమైన నష్టాలను చవిచూశాయి. హాంకాంగ్ మార్కెట్లు 13.6% నష్టపోయాయి. ఈ కోవలో వరుసగా తైవాన్(9.6%), జపాన్(9.5%), ఇటలీ(8.4%), సింగపూర్(8%) మేర పతనమయ్యాయి. స్వీడన్, చైనా, స్విట్జర్లాండ్ సూచీలకు కూడా 7% మేర నష్టం వాటిల్లింది.
మార్కెట్ల పతనం మంగళవారం కూడా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. చైనా తన 34% శాతం ప్రతీకార సుంకాలను వెనక్కి తీసుకోకపోతే ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను ప్రస్తుత 34 నుంచి 50 శాతానికి పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగాహెచ్చరించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ పతనానికి ఇప్పట్లో విరామం ఉంటుందనే సూచనలు కనిపించడం లేదు
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు