లాభాల్లోకి ఆసియా మార్కెట్లు

లాభాల్లోకి ఆసియా మార్కెట్లు
 
టారిఫ్‌ యుద్ధం మధ్య ప్రపంచవ్యాప్తంగా సోమవారం మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అయితే, ఒక రోజులోనే మార్కెట్లలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆసియా మార్కెట్లు మంగళవారం మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. జపాన్ నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ నిన్న 8శాతం పడిపోగా.. మంగళవారం 5.5శాతం పెరుగుదలను నమోదు చేసింది. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనేక దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలపై వెనక్కి తగ్గేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో యూఎస్‌ మార్కెట్లు సహా ఆసియా మార్కెట్లన్నీ దారుణంగా పడిపోయాయి. జపాన్‌ టోక్యోలో మార్కెట్ మంగళవారం ప్రారంభమైన అరగంట తర్వాత నిక్కీ 225 పాయింట్లు పెరిగి 32,819.08 పాయింట్లకు చేరుకుంది. 
 
దక్షిణ కొరియా కోస్పి సైతం 2 శాతం పెరిగింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మార్కెట్లు సైతం లాభాల్లో మొదలవడం విశేషం. దేశీయ స్టాక్​ మార్కెట్లు సహితం లాభాల్లో దూసుకుపోతున్నాయి. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ తో సోమవారం కుదేలైన మార్కెట్లు మంగళవారం తేరుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రారంభ సూచీ సెన్సెక్స్‌ 1,100 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుండగా 350 పాయింట్లకు పైగా లాభంలో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ ఉంది.

సోమవారం ఆసియా మార్కెట్లు ప్రారంభంలోనే భారీగా పడిపోయాయి. హాంకాంగ్ స్టాక్‌లు 13.2శాతం క్షీణించాయి. 1997 ఆసియా ఆర్థిక సంక్షోభం తర్వాత సోమవారం మార్కెట్‌కు బ్లాక్‌ మండేగా నిలిచింది. సోమవారం ఎస్‌ఎండ్‌పీ 500 0.2శాతం పడిపోయింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 349 పాయింట్లు పతనమైంది. 

నాస్‌డాక్‌ కాంపోజిట్ 0.1శాతం లాభపడింది. మూడు సూచీలు భారీ నష్టాల్లోనే మొదలయ్యాయి. ప్రపంచంలోని ఇతర మార్కెట్లతో పతనంతో.. డౌ జోన్స్ 1,700 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత దాదాపు 900 పాయింట్లు లాభపడింది. ఎస్‌అండ్‌పీ 500 4.7శాతం నష్టాల నుంచి లాభాల్లోకి దూసుకెళ్లింది. చాలా సంవత్సరాల తర్వాత నష్టాల నుంచి లాభాల్లోకి చేరుకోవడం విశేషం.