సీపీఎం నూతన సారథిగా ఎం.ఎ. బేబీ ఎన్నిక

సీపీఎం నూతన సారథిగా ఎం.ఎ. బేబీ ఎన్నిక

కేరళకు చెందిన పొలిట్‌బ్యూరో సభ్యులు మరియం అలెగ్జాండర్‌ బేబీ సిపిఐ(ఎం) 6వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో జరిగిన 24వ సిపిఐ(ఎం) అఖిల భారత మహాసభలో కేంద్ర కమిటి ఆయనను ఎన్నుకుంది. ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ తరువాత కేరళ నుండి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా నిలిచారు.

కేరళలోని కొల్లాం జిల్లాలోని ప్రాక్కుళంలో 1954 ఏప్రిల్‌లో జన్మించిన ఆయన  ఎస్‌ఎఫ్‌ఐ, డెమోక్రటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సిపిఐ(ఎం)లలో అనేక బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఆయన 1986 నుండి 1998 వరకు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. 2006-2011సమయంలో కేరళ విద్యామంత్రిగా పనిచేశారు. 

2012లో కేరళలోని కొజికోడ్‌లో జరిగిన 20వ సిపిఐ(ఎం) మహాసభల్లో ఎం.ఎ.బేబీ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఎన్నికయ్యారు. 85 మంది సభ్యులతో సీపీఎం పార్టీ కేంద్ర కమిటీని ఎన్నుకోగా,  18 మందితో కొత్త పొలిట్‌బ్యూరో సైతం ఎన్నుకున్నారు. ఈ కేంద్ర కమిటీలో 20 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. పొలిట్‌బ్యూరో సభ్యులుగా 8మంది కొత్తవారు ఎన్నికయ్యారు. 

కొత్త సభ్యులుగా యు.వాసుకి, విజుకృష్ణన్‌, మరియం ధావలే, శ్రీదీప్‌ భట్టాచార్య, అమరారామ్, కె.బాలకృష్ణన్‌, ఆర్‌.అరుణ్‌కుమార్‌, జితేంద్ర చౌదరిలను చేర్చారు.  ఇప్పటివరకు పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న సీనియర్‌ నేతలను ప్రకాష్‌ కారత్‌, బృందా కారత్‌, మాణిక్‌ సర్కార్‌లని తప్పించి  ప్రత్యేక ఆహ్వానితులుగా  ప్రకటించారు. 

ఏపీ సీనియర్ నేత బీవీ రాఘవులుకు పోలిట్‌ బ్యూరో తిరిగి చోటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ నుండి ముగ్గురు సభ్యులు కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి రమాదేవి, కె లోకనాథం లు ఎన్నికయ్యారు.