నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ‘రైతు నేత’ జగ్జీత్‌ సింగ్‌

నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ‘రైతు నేత’ జగ్జీత్‌ సింగ్‌

దేశంలోని అన్నదాతల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రైతుల నేత జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఆదివారం విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీతో పాటు, పలు డిమాండ్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు గతేడాది నవంబర్‌ 26న ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. 

దానిని విరమించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి రణ్‌వీత్‌సింగ్‌ బిట్టు విజ్ఞప్తి చేశారు. దీనితో పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్‌లో నిర్వహించిన ‘కిసాన్ మహా పంచాయత్’లో నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు దల్లేవాల్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మాట్లాడుతూ, ‘ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని మీరంతా నన్ను కోరారు. ఈ ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపినందుకు మీకు రుణపడి ఉంటాను. మీ మనోభావాలను నేను గౌరవిస్తూ, మీ ఆదేశాలను పాటిస్తున్నా” అని తెలిపారు.

సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా (కేఎంఎం) కలిసి ఏర్పాటు చేసిన వేదికలో కీలక నేతగా జగ్జీత్‌సింగ్‌ దల్లేవాల్‌ ఉన్నారు. ఈయన కేంద్రం రైతుల డిమాండ్లను అంగీకరించాలని కోరుతూ గతేడాది నవంబర్‌ 26న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. దీనితో కేంద్ర ప్రభుత్వం జనవరిలో రైతులను చర్చలకు ఆహ్వానించారు.
 
దీనితో దీక్ష చేపట్టిన స్థలంలోనే వైద్య సాయం తీసుకొనేందుకు ఆయన అంగీకరించారు. కానీ, తన నిరాహార దీక్షను మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఈ శనివారం నాడు కేంద్రమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఓ ట్వీట్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల ప్రతినిధుల చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. మే 4న ఉదయం 11 గంటలకు రైతులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దల్లేవాల్‌ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.