ఇంజనీరింగ్‌ అద్భుతం పాంబన్‌ రైలు బ్రిడ్జి

ఇంజనీరింగ్‌ అద్భుతం పాంబన్‌ రైలు బ్రిడ్జి

* నేడే ప్రధాని మోదీ ప్రారంభం ఆధునిక ‘రామ సేతు’

శ్రీరాముడు నడయాడిన పాంబన్‌ దీవి మరో అద్భుత ఆవిష్కరణకు వేదికవుతోంది. రావణ లంకకు వెళ్లేందుకు నాడు వానరసేన నిర్మించినట్లు విశ్వసించే రామసేతు మొదలయ్యేది పాంబన్‌ నుంచే! పాంబన్‌ దీవిని ప్రధాన భూభాగంతో అనుసంధానించేందుకు నిర్మించిన అధునాతన రైలు మార్గాన్ని శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 
 
శ్రీలంక పర్యటన ముగించుకుని ప్రధాని ఆదివారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో తమిళనాడులోని మండపం చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన కొత్త రైలుబ్రిడ్జిని, కొత్త లిఫ్ట్‌ను, రామేశ్వరం-తాంబరం రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరంలోని రామనాథస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 
 
శ్రీలంకకు-భారత్‌కు మధ్య ఉన్న పాక్‌ జలసంధిలో పాంబన్‌ దీవి ఉంటుంది. మన దేశం నుంచి కాస్త విసిరేసినట్లుగా ఉండే ఆ దీవిని దేశ ప్రధాన భూభాగంలోని రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించేదే పాంబన్‌ రైలు వంతెన. సముద్రంపై నిర్మితమైన ‘వర్టికల్‌ లిఫ్ట్‌’ ఉన్న వంతెన ఇది. దేశంలో ఇలాంటి వంతెనను నిర్మించడం ఇదే ప్రథమం. మండపం ప్రాంతం నుంచి పాంబన్‌ దీవికి 2.07 కి.మీ పొడవున నిర్మించిన ఈ వంతెనను ‘రామసేతు’కు వారధిగా అభివర్ణిస్తున్నారు.
 
దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవున ఈ పంబన్‌ బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జ్‌ మధ్యలో షిప్‌లు వెళ్లేందుకు వీలుగా వర్టికల్‌ లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో ఇంజినీర్‌లు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. తుప్పు పట్టకుండా బ్రిడ్జి మొత్తం స్పెషల్‌ కెమికల్‌తో కోటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని తమిళనాడులో రూ.8,300 కోట్లకుపైగా విలువైన వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేయనున్నారు.
 
పాంబన్‌ పాత వంతెన దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి కోసం మొదట రూ. 250 కోట్లు కేటాయించింది. కానీ వంతెన పూర్తయ్యేనాటికి వ్యయం రూ. 535 కోట్లకు పెరిగింది. ఓడల రాకపోకల కోసం పాత వంతెన రెండుగా విడిపోయేది. అయితే కొత్తగా నిర్మించిన రైల్వే వంతెన మార్గం అలా విడిపోకుండా మధ్యలో భాగం లిఫ్టుల ద్వారా నిలువుగా పైకి లేచేలా (వర్టికల్‌ లిఫ్ట్‌) రూపొందించారు.మోటార్ల సాయంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా లిఫ్ట్‌ను ఎత్తుతారు.