
దేశంలోని ప్రజలందరూ బీజేపీ సుపరిపాలనను చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల పార్టీ సాధించిన అనేక చారిత్రాత్మక విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందని తెలిపారు.. బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. దేశ పురోగతికి, ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామని ప్రధాని చెప్పారు.
కార్యకర్తలే తమ పార్టీకి వెన్నెముకని, వారి శక్తి, ఉత్సాహం ప్రేరణాదాయకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాలుగా పార్టీ బలోపేతం కోసం తమ జీవితాలను అంకితం చేసినవారి సేవలు మరువలేనివని చెప్పారు. దేశ ప్రజలు తమ పార్టీ సుపరిపాలన అజెండాను చూస్తున్నారని, ఇటీవలి సంవత్సరాల్లో మేం సాధించిన విజయాల్లో ఇది ప్రతిబింబిస్తోందని తెలిపారు.
లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేశారు.సమాజ సర్వతోముఖాభివృద్ధి దిశగా తమ ప్రభుత్వాలు సేవ చేస్తుంటాయని ప్రధాని ట్వీట్ చేశారు. కాగా బీజేపీని 1980లలో స్థాపించారు. 1984లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
అయితే ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌కే అద్వానీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగింది. ఆ విధంగా 1990లలో మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చింది. అనంతరం 2014 నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలో వరుసగా మూడోసారి కేంద్రంలో కొలువుదీరింది. కాగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరాముని ఆశీస్సులు దేశ ప్రజలకు అన్ని ప్రయత్నాల్లో మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రభు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉంటాయి. మన అన్ని ప్రయత్నాలలో ఆ స్వామి మనకు మార్గనిర్దేశనం చేస్తుంటారు’ అని ప్రధాని తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం