
ఇటీవల వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. బుధవారం లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై 13 గంటలకు పైగా చర్చ జరిగిన తర్వాత సవరణల వారీగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు.
రాజ్యసభలోనూ 12గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. వక్ఫ్ బిల్లు పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్లుగా (ఉమీద్-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం పేర్కొంది.
వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఇదోక చరిత్రాత్మక మలుపు అని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న ఆయన తాజా బిల్లుతో ఇన్నాళ్లూ అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించారు. వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని పేర్కొన్నారు.
వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయటం ప్రభుత్వం ఉద్దేశం కాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని “ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు” తెలిపింది. చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు అన్ని మత, సామాజిక సంస్థల సమన్వయంతో ప్రచారం కొనసాగుతుందని పేర్కొంది.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు