బీ2 బాంబ‌ర్లు, యుద్ధ నౌక‌ల్ని మోహ‌రించిన అమెరికా

బీ2  బాంబ‌ర్లు, యుద్ధ నౌక‌ల్ని మోహ‌రించిన అమెరికా
డోనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌ల‌పై ప్ర‌పంచ‌దేశాలు టెన్ష‌న్‌లో ఉండ‌గా, గుట్టుచ‌ప్పుడు కాకుండా అమెరికా మాత్రం త‌న సైనిక క‌ద‌లిక‌ల్ని మ‌రింత ప‌టిష్టం చేసుకుంటోంది. హిందూ మ‌హాస‌ముద్రం, ఇండోప‌సిఫిక్ ప్రాంతాల్లో బీ2 బాంబ‌ర్ల‌ను మోహ‌రించింది. అతిపెద్ద సంఖ్య‌లో బీ2 బాంబ‌ర్ల‌ను హిందూ మహాస‌ముద్రంలో మోహ‌రించేందుకు పెంటగాన్ ఆదేశాలు జారీ చేసింది. 
 
దీంతో డీగో గార్సియా దీవిలో ఉన్న మిలిట‌రీ బేస్‌కు ఆరు బీ2 బాంబ‌ర్ విమానాల‌ను మోహ‌రించారు. ప్లానెట్ ల్యాబ్స్ శాటిలైట్ చిత్రాల ఆధారంగా వాటిని క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఇంకా అక్క‌డ ఉన్న షెల్ట‌ర్లు, హ్యాంగ‌ర్ల‌లో ఏమైనా బాంబ‌ర్లు ఉండి ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.  అమెరికా వ‌ద్ద మొత్తం 20 బీ2 స్టీల్త్ బాంబ‌ర్ల ఉన్నాయి. 
 
అత్యంత అత్యాధునిక మిలిట‌రీ విమానాల్లో ఆరింటిని ప్ర‌స్తుతం హిందూ మ‌హాస‌ముద్రంలో మోహ‌రించారు. అంటే త‌మ వ‌ద్ద ఉన్న ఫ్లీట్‌లో 30 శాతం అక్క‌డే ఉన్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. దీంట్లో చాలా వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు ఉన్నట్లు భావిస్తున్నారు. బీ2 బాంబ‌ర్ల‌తో పాటు యుద్ధ విమానాల‌ను మోసుకెళ్లే నౌక‌ల‌ను ఇండోప‌సిఫిక్ ప్రాంతంలో మోహ‌రిస్తున్నారు. రెండు యుద్ధ నౌక‌ల‌ను హిందూ మ‌హాస‌ముద్రంలోకి, ఒక‌టి ద‌క్షిణ చైనా సీ వ‌ద్ద‌కు తీసుకెళ్తున్నారు.యూఎస్ఎస్ కార్ల్ విన్‌స‌న్‌ మిడిల్ ఈస్ట్‌కు వెళ్తోంది. ఇక యూఎస్ఎస్ హ్యార్ ఎస్ ట్రూమ‌న్‌.. ఆరేబియా స‌ముద్రం నుంచి ఆప‌రేట్ చేస్తుంది. ఇక మూడ‌వ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియ‌ర్ యూఎస్ఎస్ నిమిట్జ్‌ ద‌క్షిణ చైనా స‌ముద్రం దిశ‌గా వెళ్లేందుకు పెంట‌గాన్ ప్లాన్ చేసింది. 

అక‌స్మాత్తుగా యుద్ధ నౌక‌ల‌ను ఎందుకు మోహ‌రిస్తుంద‌న్న అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే హిందూ మ‌హాస‌ముద్ర ప్రాంతంలో ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ బ‌లోపేతం చేసే ఉద్దేశంతో ఈ చ‌ర్య చేప‌ట్టిన‌ట్లు పెంటగాన్ తెలిపింది. య‌మెన్‌లోని హౌతీ మిలిటెంట్ల‌ను టార్గెట్ చేసే ఉద్దేశంతో బీ2 బాంబ‌ర్ల‌ను అమెరికా మోహ‌రించిన‌ట్లు అనుమానిస్తున్నారు. 

అయితే ఒక్కొక్క బాంబ‌ర్ విమానం సుమారు 40 వేల పౌండ్ల సామ‌ర్థ్యం ఉండే పేలోడ్‌ను మోసుకెళ్ల‌గ‌ల‌వు. అయితే యెమెన్ మిలిటెంట్ల‌ను తుది ముట్టించేందుకు ఆ బాంబ‌ర్లు చాలా ఎక్కువ‌వుతాయ‌ని ర‌క్ష‌ణ శాఖ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.