మార్కెట్లపై అమెరికా సుంకాల ప్రకంపనలు

మార్కెట్లపై అమెరికా సుంకాల ప్రకంపనలు

అమెరికా సుంకాల ప్రకంపనలు భారత మార్కెట్లను భారీ నష్టాలకు గురి చేశాయి. ట్రంప్‌ పన్ను విధానాలు అమెరికా సహా ప్రపంచ దేశాల మార్కెట్లను ఓ కుదుపు కుదిపాయి. ఈ ప్రభావం శుక్రవారం దలాల్‌ స్ట్రీట్‌పై తీవ్రంగా పడింది. ఒక్క పూటలో మదుపర్ల సంపద రూ.9.5 లక్షల కోట్లు పైనా హరించుకుపోయింది. 

ఉదయం ప్రతికూలతలో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. తుదకు 931 పాయింట్లు లేదా 1.22 శాతం నష్టంతో 75,365కు పడిపోయింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 346 పాయింట్లు కోల్పోయి 22,904 వద్ద ముగిసింది. బిఎస్‌ఇ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.9.5 లక్షల కోట్లు తుడుచుకుపెట్టుకుపోయి రూ.403.83 లక్షల కోట్లకు పరిమితమయింది.

భారత ఫార్మా ఉత్పత్తులపై సుంకాలను వేయబోమని తొలుత ప్రకటించిన డొనాల్డ్‌ ట్రంప్‌ మరుసటి రోజే మాట మార్చారు. ఔషధాలపై భారీగానే టారీఫ్‌లు వేస్తామని మీడియాతో ప్రకటించడంతో ఆ రంగం కంపెనీల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అరబిందో ఫార్మా, లారస్‌ ల్యాబ్స్‌, లుపిన్‌, సన్‌ ఫార్మా షేర్లు 7.2 శాతం వరకు పతనమయ్యాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టి, అదానీ పోర్ట్స్‌ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి. మరోవైపు బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసిజి షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

ప్రపంచ దేశాల నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై భారీగా టారీఫ్‌లు విధించడం ఇన్వెస్టర్లలో తీవ్ర భయాలను నెలకొల్పింది. వాణిజ్య యుద్ధ భయాలు ఆర్ధిక వ్యవస్థలను దెబ్బతీస్తాయన్న నిపుణుల ఆందోళనలు పెరిగాయి. యుఎస్‌కు ధీటుగా చైనా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ప్రతీకార సుంకాల ప్రణాళికలను సిద్దం చేస్తోన్నాయనే రిపోర్టులు మార్కెట్లను కుదిపేశాయి. 

ప్రతీకార సుంకాల మూలంగా యుఎస్‌ మాంద్యంలోకి వెళుతుందన్న అంచనాలు పెరిగాయి. అమెరికా సుంకాల విధింపు ఎగుమతి ఆధారిత రంగాలకు దెబ్బేనని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ రేటింగ్‌ ఆఫీసర్‌ సచిన్‌ గుప్తా పేర్కొన్నారు. ఈ టారీఫ్‌లతో ఆయా సంస్థల వ్యయాలపై ప్రభావం పడనుందన్నారు. అనిశ్చితితతో ప్రయివేటు రంగ మూలధన వ్యయాలు నిలిచిపోవచ్చన్నారు. రూపాయి విలువ తగ్గుదల ఎగుమతిదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించొచ్చని తెలిపారు.