తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా!
ఉగాది సందర్భంగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు గత కొద్దీ రోజులుగా విస్తృతంగా కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ లో ఇప్పుడు మౌనం రాజ్యమేలుతుంది. మంత్రివర్గ విస్తరణ గురించి ఏకాభిప్రాయం సాధించడం సాధ్యం కాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేసేందుకు చూస్తున్నారని తెలుస్తున్నది.
 
మరోవంక, ఎమ్యెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టులో వాదోపవాదాలు ముగియడం, తీర్పు రిజర్వ్ కావడంతో ఉపఎన్నికలు తప్పవనే ఆందోళన కాంగ్రెస్, బిఆర్ఎస్ లలో వ్యక్తం అవుతున్నది. ఈ లోగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
 
మరోవంక, కెసీఆర్ సహితం పార్టీ నేతలతో పార్టీ రజతోత్సవ సంబరాల పేరుతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం లో ఎన్నికల సమరం కోసం రేవంత్ – కేసీఆర్ కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై అనర్హత వేయాలని గులాబీ పార్టీ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ పూర్తయింది. తీర్పు రిజర్వ్ అయింది. 
 
ఇదే అంశం పైన అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు సైతం విచారణ వేళ ప్రస్తావనకు వచ్చాయి. ఇక, బీఆర్ఎస్ మాత్రం ఉప ఎన్నికలు తప్పవని చెబుతోంది. సుప్రీం నిర్ణయం ఏంటనేది ఉత్కంఠగా మారుతున్న సమయంలో రేవంత్ సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. 
 
సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సి పాలిటీలకు కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన కసరత్తు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలను జూలైలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్ని కల ఏర్పాట్లపైనా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీలకు ఎన్నికలకు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీల్లో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించాలనే ఆలో చనలో ప్రభుత్వం ఉంది. అధికారులు మాత్రం ముందు సర్పంచ్‌ ఎన్నికలే నిర్వహించాలని సూచిస్తున్నారని సమాచారం. గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఇప్పటికే ఏడాదికి పైగా అయింది. 
 
కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రూ.1,500 కోట్లకు పైగా నిలిచిపోయాయనే వివరాలను సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. మొదట సర్పంచ్‌ ఎన్నికలను నిర్వహించి, ఆయా పాలకవర్గాల వివరాలను కేంద్రానికి నివేదిస్తే.. నిలిచిపోయిన నిధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు