తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా

తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై ఆ పదవికి రాజీనామా చేశారు. త్వరలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడుని బీజేపీ నియమిస్తుందని ఆయన తెలిపారు. రాజీనామా లేఖను పార్టీ  జెపి నడ్డాకు పంపిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తదుపరి బీజేపీ అధ్యక్ష పదవికి తాను లేనని శుక్రవారం స్పష్టం చేశారు. బీజేపీ నేతలు పార్టీ నాయకత్వ పదవికి పోటీపడరని అన్నామలై తెలిపారు.
 
తామంతా కలిసి పార్టీ అధ్యక్షుడ్ని ఎన్నుకుంటామని చెప్పారు. “తదుపరి రాష్ట్ర అధ్యక్షుడి రేసులో నేను లేను. నేను ఎలాంటి రాజకీయ ఊహాగానాలకు ప్రతిస్పందించను. నేను ఏ రేసులోనూ లేను” అని కోయంబత్తూరులో మీడియాతో చెప్పారు. అయితే తాను తమిళనాడు రాజకీయాలలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

కాగా, తమిళనాడులో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని అన్నామలై తెలిపారు. పార్టీ ఎదుగుదల కోసం చాలా మంది తమ ప్రాణాలను అర్పించారని చెప్పారు. అందుకే పార్టీకి ఎల్లప్పుడూ మంచి జరుగాలని తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే బీజేపీ అధిష్టానం అన్నామలైకు పార్టీలో మరో కీలక పదవి ఇవ్వవచ్చని తెలుస్తున్నది.

మరోవైపు 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు బీజేపీ సిద్ధమైంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని అధికార డీఎంకే పార్టీ భావిస్తుండగా ఎలాగైనా ఈసారి తమిళనాడులో అడుగుపెట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇక తొలిసారే విజయం సాధించి చరిత్ర సృష్టించాలని ప్రముఖ నటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు.

ఇటీవల అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి ఢిల్లీలో బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. అయితే బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు కోసమే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
 

”తమిళనాడు బీజేపీలో ఎలాంటి పోటీ లేదు. మేము ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకుంటాం. నాయకత్వ రేసులో నేను పోటీ పడను” అని చెప్పారు. 2011 కర్ణాటక బ్యాచ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020 ఆగస్టులో బీజేపీ చేరారు. కేవలం పది నెలల్లోనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాను పార్టీ కార్యకర్తగా అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నామలై చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7న అన్నామలై ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవుతారని తెలుస్తోంది.