చాట్‌జీపీటీతో నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డుల సృష్టి!

చాట్‌జీపీటీతో నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డుల సృష్టి!
కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విస్తృతమైన క్రమంలో దాని దుర్వినియోగమూ పెరుగుతున్నది. తాజాగా చాట్‌జీపీటీతో నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డులు తయారుచేయగలగడం ఆందోళన కలిగిస్తున్నది. చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ ఇటీవల జీపీటీ-40 ఇమేజ్‌ జనరేషన్‌ ఫీచర్‌ను విడుదల చేసింది.  ఈ టూల్‌ను వినియోగించి, ఫేక్‌ ఆధార్‌, పాన్‌ కార్డులను తయారుచేయొచ్చంటూ కొందరు నెటిజన్లు ఫొటోలతో సహా ఎక్స్‌లో వెల్లడించారు. 
దీంతో సైబర్‌ నేరగాళ్లు దీనిని దుర్వినియోగం చేయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ వాడకంపై నియంత్రణ విధించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.  ప్రాచీన భారత గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట పేరు, ఫొటోతో చాట్‌జీపీటీతో సృష్టించిన నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డులను కొందరు నెటిజన్లు ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ల ఇండియన్‌ ఐడెంటిఫికేషన్‌ కార్డులను కూడా చాట్‌జీపీటీ తయారు చేసింది. వాటి మీద క్యూఆర్‌ కోడ్‌, ఆధార్‌ సంఖ్యలు కూడా ఉన్నాయి. 

చాట్‌జీపీటీ సృష్టించిన ఓ ఫేక్‌ పాన్‌ కార్డు కచ్చితంగా ఆదాయపు పన్ను శాఖ జారీ చేసినట్లుగానే ఉందని ఓ యూజర్‌ తెలిపారు. దీనిని క్షణాల్లోనే సృష్టించిందని, ఇటువంటి టెక్నాలజీ కేటుగాళ్ల చేతుల్లోకి వెళితే పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్‌ ఇమేజెస్‌ను చాట్‌జీపీటీ క్రియేట్‌ చేయగలగడం పెద్ద విషయం కాదు కానీ, దానికి శిక్షణ ఇవ్వడం కోసం ఆధార్‌ సమాచారం, ఫొటోలు ఎక్కడి నుంచి వచ్చాయి? అనేదే ఆసక్తికరమైన అంశమని యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 

చాట్‌జీపీటీ క్షణాల్లో నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డులను సృష్టించడం తీవ్రమైన భద్రతాపరమైన ముప్పు అని, అందుకే ఏఐని తప్పనిసరిగా ఓ పరిమితి వరకు క్రమబద్ధీకరించడం తప్పనిసరి అని చెప్తున్నారు. ఈ ఫేక్‌ ఐడెంటిటీలను స్కామర్లు ఎన్ని మోసాలకు వాడుకుంటారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాము విడుదల చేసిన జీపీటీ-40 మోడల్‌ వల్ల రిస్క్‌ నిజమేనని ఓపెన్‌ఏఐ అంగీకరించింది. DALL.E డిఫ్యూజన్‌ మోడల్‌లో పని చేస్తుందని, జీపీటీ-40 ఆటోరిగ్రెసివ్‌ మోడల్‌లో ఇమేజ్‌ను సృష్టిస్తుందని తెలిపింది. ఇంతకు ముందు విడుదల చేసిన మోడల్స్‌కు భిన్నంగా దీనిలో కొత్త సామర్థ్యాలు ఉన్నాయని, ఫలితంగా కొత్త రిస్క్‌లు ఉంటాయని వివరించింది.

ఏఐ సృష్టించిన ఐడీకి, అసలు ఐడీకి తేడా తెలుసుకోవాలంటే, దానిపై ఉన్న మీ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను క్షుణ్ణంగా పరిశీలించండి. జెన్యూన్‌ ఇమేజ్‌ నుంచి తీసుకున్న ఫొటో అయినప్పటికీ, ఏఐ ఇమేజ్‌ తేడాగా ఉంటుంది. ఈ రెండు కార్డుల్లోని హిందీ/ఇంగ్లిష్‌ అక్షరాలను, వాటిని ముద్రించిన తీరును గమనించండి. ఆధార్‌ స్ట్రక్చర్‌, రంగులు ఉన్న తీరు, కామాలు వంటివాటిని పరిశీలించండి. 

అదేవిధంగా, ఆధార్‌ లోగోలు, భారత ప్రభుత్వం, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా వంటివాటినీ గమనించండి. క్యూఆర్‌ కోడ్‌ ఉందేమో చూడండి. అది అధికారికమైనదా, కాదా? తెలుసుకోవడం కోసం దానిని స్కాన్‌ చేసి తనిఖీ చేయండి.https://uidai.gov.in/ లేదా https://myaadhaar.uidai.gov.in/verifyAadhaarను సందర్శించి, ఆధార్‌ కార్డును ఆన్‌లైన్‌లో సరిచూసుకోవచ్చు. 12 అంకెల గుర్తింపు నంబరును, క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి, సరిచూసుకోవచ్చు. ఆధార్‌ నంబరు నకిలీది అయితే,  ముందుకు సాగడానికి అవకాశం ఇవ్వదు.