ఆయుష్మాన్‌ భారత్‌ లో కుంభకోణం ఈడీ కుంభకోణం

ఆయుష్మాన్‌ భారత్‌ లో కుంభకోణం ఈడీ కుంభకోణం
కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్‌ రిపోర్టు వెల్లడించింది. దీంతో ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) శుక్రవారం జార్ఖండ్‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో ఏకకాలంలో 21 ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది. 
 
జార్ఖండ్‌లో అమలైన ఆయుష్మాన్‌ పథకంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయని 2023లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన కాగ్‌ రిపోర్టు వెల్లడించింది. లేని వ్యక్తులు (మరణించిన వ్యక్తులు) ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చూపించి బీమా మొత్తాన్ని మోసపూరితంగా క్లయిమ్‌ చేస్తున్నట్లు కాగ్‌ నివేదిక వెల్లడించింది.
 
దేశంలోని 212 ఆసుపత్రుల్లో అమలవుతున్న ఈ పథకంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈ నివేదిక పేర్కొంది. కాగ్‌ నివేదిక తర్వాత ఆర్థిక మోసాలకు పాల్పడిన వారికి సంబంధించిన సమాచారాన్ని జార్ఖండ్‌ ఆరోగ్యశాఖ నుంచి ఇడి సమాచారం కోరింది. 
 
ప్రత్యేకించి కొన్ని ఆసుపత్రులపై నమోదైన ఎఫ్‌ఆర్‌ల ఆధారంగా ఇడి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఇసిఐఆర్‌) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇడి సోదాల్లో భాగంగా జార్ఖండ్‌ మాజీ ఆరోగ్యశాఖా మంత్రి బన్నా గుప్తా వ్యక్తిగత కార్యదర్శి ఓం ప్రకాష్‌, థర్డ్‌ పార్టీ అసెస్‌మెంట్‌ (టిపిఎ), ఎండి ఇండియా, సేఫ్‌వే, మెడి అసిస్ట్‌ వంటి ఏజెన్సీలకు చెందిన వారి ఇళ్లలో ఇడి సోదాలు నిర్వహించింది.