దేవాలయాల వ్యవహారంలో `సుప్రీం’ జోక్యం కుదరదు

దేవాలయాల వ్యవహారంలో `సుప్రీం’ జోక్యం కుదరదు

ఆర్టికల్‌ 32 ప్రకారం ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు దేవాలయాల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  ఏదైనా ఉంటే.. ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించాలని జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం సూచించింది. అంతేకాకుండా, ఏమైనా చెప్పుకోవాల్సింది ఉంటే  అక్కడే చెప్పుకోవాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. 

స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు చట్టాలు చేసుకుంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.  దేవాలయాలపై ప్రభుత్వాల జోక్యాన్ని నిరోధించాలని దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల్లోని దేవాదాయ శాఖ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ధర్మాసనం ముగించింది. 

దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆయా పిటిషన్ల‌పై విచారణను సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. 2012లో ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు వ్యతిరేకంగా దయానంద సరస్వతి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదులుగా పిటిషనర్లు చేర్చారు. 

ఇక అన్ని రాష్ట్రాల్లోని దేవాలయాల చట్టాన్ని మార్చాలని, అలాగే ప్రభుత్వాల నియంత్రణ నుంచి ఆలయాలను బయటికి తీసుకు రావాలంటూ పిటిషనర్ దయానంద సరస్వతి ప్రధానంగా తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తగిన విధంగా ఆదేశాలు జారీ చేయాలని తన పిటిషన్‌లో పిటిషనర్ కోరారు.

అయితే అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఒకే విధంగా ఉండవని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇక దేవాలయాల విషయంలో ప్రతి రాష్ట్రానికి ఒక సెంటిమెంట్‌ ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. దేవాలయాల ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రాముఖ్యతలు అన్ని స్థానిక కోర్టులకు తెలుస్తాయి తప్ప సుప్రీంకోర్టు వాటిని తెలుసు కోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.