హెచ్‌సీయూ భూములకై మహిళా మోర్చా సచివాలయం ముట్టడి

హెచ్‌సీయూ భూములకై మహిళా మోర్చా సచివాలయం ముట్టడి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములను వేల కోట్లకు అమ్మడానికి కుట్ర పన్నుతోంది. విద్యార్థుల భవిష్యత్తును తాకట్టుపెట్టి, పర్యావరణ విధ్వంసం చేస్తున్న చర్యలను, వన్యప్రాణులను హాని తలపెడుతున్న దమనకాండను నిరసిస్తూ బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి నాయకత్వంలో మహిళా కార్యకర్తలు తెలంగాణ సెక్రటేరియట్‌ను ముట్టడించారు. 

అయితే, శాంతియుతంగా నిరసన తెలిపిన వందమందికి పైగా మహిళా కార్యకర్తలు పోలీసులు అక్రమంగా చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. మహిళా కార్యకర్తలపై పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గ చర్య. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

హెచ్ సీయూ 400 ఎకరాల భూమి అమ్మకం విషయంలో బిజెపితో పాటు విద్యార్థులు, పర్యావరణవేత్తలు, సామాజిక ఉద్యమకారులు రాష్ట్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారు. హెచ్‌సీయూ విద్యార్థులు నిరసన చేపడుతున్న వేళ విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

భారీ బందోబస్తు మధ్య వందలాది జేసీబీలతో అడవులను తొలగించి, వన్యప్రాణుల నివాసాలను తుడిచిపెట్టి, విద్యార్థుల భవిష్యత్తును తాకట్టుపెట్టడం, పర్యావరణానికి హాని తలపెట్టాలని చూడటం అత్యంత దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు.  హెచ్‌సీయూకి చెందిన 400 ఎకరాల భూములను విశ్వవిద్యాలయానికే అప్పగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. 
 
పచ్చని అడవిని నాశనం చేసి, భూములను విక్రయించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతిఒక్కరూ తిప్పికొట్టాలని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై హెచ్‌సీయూ విద్యార్థులు పోరుబాట కొన‌సాగిస్తూనే ఉన్నారు.  జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. 
బుధ‌వారం ఉద‌య‌మే హెచ్‌సీయూ క్యాంప‌స్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివ‌ర్సిటీ లోప‌లికి బ‌య‌టి వ్యక్తుల‌ను రానివ్వ‌కుండా, విద్యార్థుల‌ను బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.  కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బుధ‌వారం ఉద‌యం హెచ్‌సీయూ క్యాంప‌స్‌లో ప్రొఫెస‌ర్లు, విద్యార్థులు నిర‌స‌న చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.
శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.  దొరికిన విద్యార్థుల‌ను దొరికిన‌ట్లు లాఠీల‌తో చిత‌క‌బాదారు. పోలీసుల తీరుపై ప్రొఫెస‌ర్లు విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రేవంత్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నిన‌దిస్తూ, పోలీస్ జులుం న‌శించాల‌ని నినాదాలు చేశారు. దీంతో హెచ్‌సీయూ క్యాంప‌స్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.
 
తాజాగా ఈ వ్యవహారంపై హెచ్‌సీయూ ప్రొఫెసర్లు స్పందిస్తూ యూనివర్సిటీ బాగు కోసం భూమిని ఇచ్చిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను తుంగలోకి తొక్కొద్దని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అప్పటి ప్రధాని ఇంధిరా గాంధీ యూనివర్సిటీకి ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారని హెచ్‌సీయూ ప్రొఫెసర్లు తెలిపారు. అయితే ఇందిర వారసులమని చెప్పుకునే ప్రస్తుత కాంగ్రెస్ నేతలు ఆమె ఆశయాలను తుంగలోకి తొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 గతంలో కూడా యూనివర్సిటీ భూములు దోచుకోవడానికి ఎంతో మంది కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు. భూముల్ని వేలం వేయడం వల్ల జీవరాశులతో పాటు జీవ వైవిధ్యానికి ఎంతో ఇబ్బంది కలుగుతుందని ప్రొఫెసర్లు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వేలంపై మరోసారి ఆలోచించాలని చెప్పుకొచ్చారు
 
మరోవంక, కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నిజ నిర్ధారణ నివేదిక పంపాలని రాష్ట్ర అటవీశాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఇప్పటికే ఉన్న కోర్టు తీర్పులను పరిగణంలోకి తీసుకోని ముందుకు వెళ్లాలని సూచించింది. అటవీ చట్టానికి లోబడి వెంటనే చర్యలు తీసుకోవాలని.. వాస్తవధార నివేదికతో పాటు సంబంధిత శాఖ తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.