ఒక్క మార్చిలోనే జీఎస్టీ వసూళ్లు 8.35% పెరుగుదల

ఒక్క మార్చిలోనే జీఎస్టీ వసూళ్లు 8.35% పెరుగుదల

2024-25 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్టీతో పాటు వ్యాట్ వసూళ్లు, వృత్తి పన్ను కలిపి రూ. 51,297 కోట్ల రెవెన్యూ వచ్చిందని ఏపీ పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఏ స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో క్రమేణా వృద్ధి నమోదు అవుతోందని తెలిపారు. 2025 మార్చి నెలకు రూ. 3,116 కోట్ల జీఎస్టీ వసూలు అయ్యిందని ఆయన తెలియజేశారు.

గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 8.35 శాతం మేర అదనంగా జీఎస్టీ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి 31 తేదీ వరకూ రూ.33,660 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చిందన్నారు. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి రూ.44,825 కోట్ల గ్రాస్ జీఎస్టీ వసూళ్లు అయినట్టు వివరించారు. 

గత ఏడాది ఇదే సమయానికి రూ.44,298 కోట్ల గ్రాస్ జీఎస్టీ వసూళ్లు వచ్చాయన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాదిలో 1.19 శాతం మేర జీఎస్టీ వసూళ్లు పెరిగాయని వెల్లడించారు. 2024 అక్టోబర్​లో రూ.2820 కోట్లు, 2024 నవంబరులో రూ.2843 కోట్లు జీఎస్టీ ఆదాయం వచ్చిందని అలాగే డిసెంబర్​లో రూ.2524 కోట్లు, 2025 జనవరిలో రూ.2904 కోట్లు, ఫిబ్రవరిలో రూ.2937 కోట్ల జీఎస్టీ వసూలు అయినట్టు స్పష్టం చేశారు. 

2025 మార్చిలో రూ.3116 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చినట్టు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ వసూళ్లలో 5 శాతం మేర స్వల్పంగా తగ్గుదల నమోదు అయ్యిందని, 2024-25 ఆర్ధిక సంవత్సరానికి రూ.16,176 కోట్లు వచ్చాయన్నారు. అలాగే మద్యంపై వ్యాట్ ఆదాయంలోనూ 4.02 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. 

గత ఏడాదితో పోలిస్తే రూ.924 కోట్లు వసూలు అయ్యింది. అయితే వృత్తిపన్నులో 15 శాతం మేర అదనంగా ఆదాయం వచ్చిందని. ఈ ఏడాదిలో రూ.372 కోట్ల పన్ను వసూలు అయినట్టు వివరించారు. మొత్తంగా జీఎస్టీ పాటు వ్యాట్, వృత్తి పన్నుతో కలిపి రూ.51,297 కోట్ల మేర రెవెన్యూ ఆర్జించినట్టు రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ స్పష్టం చేశారు.