
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సారధ్యంలో “తొలి తెలంగాణ విత్తన పండుగ”ను ఏప్రిల్ 4 నుండి 6 వరకు హైదరాబాద్ కు సమీపంలోని కడ్తాల్ మండలం ద ఎర్త్ సెంటర్, అల్మాస్ పల్లి గ్రామం వద్ద గల `ద ఎర్త్ సెంటర్’లో నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం సాంప్రదాయ విత్తనాల వైభవాన్ని తెలియజేసేందుకు, సుస్థిర వ్యవసాయ పద్దతులను ప్రోత్సహించేందుకు, రైతులను, పరిశోధకులను, విధాన నిర్ణేతలను ఒక వేదిక పైకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంగా కౌన్సిల్ చైర్మన్ కె లీలా లక్ష్మారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో విత్తన పరిశోధనలు, రైతులు తమ అనుభవాలను పంచుకోవడం, నిపుణుల ప్రసంగాలు ఉంటాయని ఆమె చెప్పారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ను 2010 ఏప్రిల్ 22న భూమి దినోత్సవం సందర్భంగా స్థాపించారు. అప్పటి నుండి పర్యావరణ విద్యను ప్రోత్సహిస్తూ రెండు తెలుగు రాస్త్రాలలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది.
గతంలో 4,000కి పైగా పాఠశాలలతో కలిసి 34 లక్షల మొక్కలు నాటడం, 11 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చేర్చుకోవడం వంటి అనేక ప్రభావశీలమైన కార్యక్రమాలను అమలు చేసింది. సహజ సమృద్ధి వ్యవస్థాపకులు డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, ప్రజా విధాన నిపుణులు డా. దొంతి నరసింహారెడ్డి, సీనియర్ సలహాదారుడు ఆర్ దిలీప్ రెడ్డి ఈ కార్యక్రమ వివరాలను తెలిపారు.
విత్తనాలు జీవ సృష్టికి, శక్తికి సంకేతాలు. విత్తనాలే వ్యవసాయ రంగానికి ఊపిరి. ఒక కుటుంబాన్ని, దేశాన్ని పోషించగలిగే శక్తి విత్తనాలలో ఉంది. విత్తనాలు మన ఆరోగ్యాన్ని కాపాడి, దీర్ఘకాలిక వ్యాధులను సైతం నివారించే శక్తిని పెంపొంది ఉన్నాయి. మనిషి ఆరోగ్యము విత్తనాలపై, వాటి జన్యు వైవిధ్యం పైన ఆధారపడి ఉంది.
భారతదేశంలోని రైతులకు విత్తన వంగడాలని సంరక్షించడం, వాటిని సాగు చేయడం, పంచుకోవడం జీవితకాల లక్ష్యంగా మారిపోయింది. ఈ జ్ఞానం, నైపుణ్యం వాతావరణ మార్పుల ప్రభావాల నుంచి ఆహార వ్యవస్థలను రక్షించడానికి సహాయ పడుతున్నాయి. సామూహిక విత్తన బ్యాంకులు సంప్రదాయ విత్తనాలను సేకరించి, భద్రపరిచి, పరస్పరం పంచుకోవడం ద్వారా విస్తృతమైన జీవవైవిధ్యాన్ని పెంచగలిగాయి.
ఆధునిక సాంకేతిక లేని దూరప్రాంతాల్లో రైతులకు విత్తన బ్యాంకులు చాలా సహాయ పడుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక సంస్థలు, వ్యక్తులు విత్తనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమంలో మహిళలు ప్రముఖంగా పాల్గొంటున్నారు. విత్తనాలపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటాల్లో భాగంగానే విత్తనోత్సవాలు, రైతు విత్తన బ్యాంకులను స్థాపించడం, విత్తనాల వైవిధ్యాన్ని కాపాడడం, చిన్న రైతులను ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయ విధానాల కార్యక్రమాలు జరుగుతున్నాయి.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి