ఎన్‌కౌంటర్‌లో సీనియర్‌ మావోయిస్టు రేణుక మృతి

ఎన్‌కౌంటర్‌లో సీనియర్‌ మావోయిస్టు రేణుక మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా భైరాంఘర్‌ పరిధిలోని బాజీపూర్‌ బార్డర్‌ నెల్‌గోడా వద్ద సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన మావోయిస్టు గుమ్మడవెల్లి రేణుక అలియాస్‌ భాను అలియాస్‌ చైతీ అలియాస్‌ సరస్వతి మృతి చెందింది. ఈమెపై తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. 

దంతెవాడబీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడం తో సిఆర్‌పిఎఫ్, డిఆర్‌జి సిబ్బంది యాంటీ- నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడగా భద్ర తా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలంలో ఓ మహిళా నక్సలైట్ మృతదేహాన్ని గురించినట్లు అధికారులు తెలిపారు.

ఈమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీమ్ ఇన్ఛార్జీగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీఎత్తున తుపాకులు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. 

తాజా ఎన్‌కౌంటర్ కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు చత్తీస్‌గఢ్‌లో 141 మంది మావోయిస్టులను వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా సిబ్బంది హతమార్చారు. ఇంతవరకు 346 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కడవెండికి చెందిన గుమ్మడవెల్లి సోమయ్య- జయమ్మ దంపతుల కూతురు రేణుక. ఆమె అన్న గుమ్మడవెల్లి వెంకటకృష్ణప్రసాద్‌ (జీవీకే ప్రసాద్‌) మావోయిస్ట్‌ పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేసి లొంగిపోయారు. 1996లో ఆమె మావోయిస్టు పార్టీలో చేరారు.  అలిపిరిలో చంద్రబాబు నాయుడు బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటన అనంతరం నిర్బంధం పెరగడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లింది. 

రేణుక 2005లో మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్‌ కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావును వివాహమాడిందని, అతను 2010లో నల్లమలలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్టు ఐజీ వెల్లడించారు. రేణుక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలు కడవెండిలోనే చేసేందుకు కుటుంబ సభ్యు లు మొగ్గు చూపారని తెలిసింది.