పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉంది

పేదరిక నిర్మూలనకు కేంద్రం కట్టుబడి ఉంది

పేదరిక నిర్మలనకు కేంద్రం కట్టుబడి ఉందని, ఎంఎస్ఎంఈకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. దేశంలోని టాప్ 500 కంపెనీలు ఓ కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి చూపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారని ఆమె గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో రాష్ట్రంలోని పేదలకు ధనవంతులు చేయూత ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారని పేర్కొన్నారు. 

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల నూతన అధ్యక్షులు, ఇన్‌చార్జిలతో సంస్థాగత అంశాలు-రాజకీయ కార్యాచరణపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు మాట్లాడుతూ ఏడాది క్రితం వరకూ రాష్ట్రంలో విద్వేషం, విధ్యంసం మాత్రమే కనిపించేవి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీకి భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపించేదని తెలిపారు.

ఎన్నికలకు ముందు తాము పేర్కొన్న విధంగా డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలో ఉంటే ప్రజలకు మెరుగైన పాలన సాధ్యమవుతుందనే ప్రకటనలను ఆచరణలో సాధ్యం చేస్తున్నామని చెప్పారు.  “డబులింజన్‌ సర్కార్‌ వల్ల కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. రహదారులకు కొత్త రూపు వచ్చింది. మోదీ, బాబు, పవన్‌ సమన్వయంతో పోలవరం, అమరావతి నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని ఆమె పార్టీ నేతలకు పురందేశ్వరి దిశా నిర్దేశం చేశారు.

వైఎస్సార్సీపీ పాలన అంతా విద్వేషం, ప్రగతి శూన్యతతో సాగిందని విమర్శించారు. అభివ్రద్ధికి తావులేకుండా ఐదేళ్ల పాటు ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. రహదారుల పరిస్థిని ఎంత అధ్వాన్న స్థితిలో ఉండేదనేది అందరికీ అనుభవంలో ఉన్నదేనని చెప్పారు. 

వైఎస్సార్సీపీ పాలనలో విద్వేషం ఎక్కువై నోరు మెదిపిన వారిపై అక్రమంగా అట్రాసిటీ కేసులను నమోదు చేశారని ప్రజావేదిక కూల్చివేతతో వైఎస్సార్సీపీ తమ విధ్వంస, విద్వేష పాలన ప్రారంభించిందని ఆమె మండిపడ్డారు. ఒక్క కొత్తపెట్టుబడి కూడా రాష్ట్రానికి రానీయలేదని, బిడ్డలకు ఉపాధి దూరం చేశారని, మద్యం మాఫియాతో వైఎస్సార్సీపీ నేతలు భారీగా డబ్బులు చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 

మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమన్వయంతో ముందుకెళ్తున్నారని తెలిపారు. ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు ఇచ్చారని, అమరావతి రాజధానికి రూ.12,500 కోట్లు ఏడీబీ నుంచి, రూ.11వేల కోట్లు హడ్కో నుంచి ఇస్తున్నారని ఆమె చెప్పారు.  గుంతలమయమైన రహదారుల బాగుకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారని, పంచాయతీరాజ్ కు రూ.4,800 కోట్లు ఇచ్చారని, రూ.7,200 కోట్లు టాక్సు డివల్యూషన్ గా నిధులు విడుదల చేశారని పురందేశ్వరి వివరించారు.