
700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని చెబుతూ ఈ భూములను రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నదని ఆరోపించారు. హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో వందల జేసీబీలు ఉపయోగించి చెట్లను నరికి, భూములను అమ్మే ప్రయత్నం చేస్తోందని బిజెపి ఎమ్యెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చించి పరిశోధన కేంద్రాలు స్థాపిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులకు భూములు కేటాయించలేకపోతోందని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలోని భూములను ఇలా అమ్మేస్తే భవిష్యత్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూములు ఎక్కడి నుంచి కేటాయిస్తారు? అని ఆయన ప్రశ్నించారు.
గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోకాపేట భూములను తాకట్టుపెట్టగా ఇప్పుడు రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను మించి భూములను అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను విద్యార్థుల భవిష్యత్తు కోసం లైబ్రరీలు, కమ్యూనిటీ హాళ్లు, ఆసుపత్రులు, స్కూళ్ల కోసం ఉపయోగిస్తామని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేసారు. కాని ఇప్పుడు అవే భూములను అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా భూములను ఇష్టానుసారంగా అమ్ముతూ పోతే పర్యావరణానికి, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా ఉండగా, గచ్చిబౌలిలోని సర్వే నంబరు 25లో 400 ఎకరాలపై యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానివేనని రెవేమీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వేసిన వ్యాజ్యాలపై పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు దక్కించుకుందని పేర్కొన్నారు. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందినది లేదని తేల్చి చెప్పారు.
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు