
ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మధ్య, తూర్పు, వాయువ్య ప్రాంతాల్లో హీట్‌వేవ్ మరింత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ పేర్కొన్నది. పశ్చిమ, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నార్మల్‌గా ఉంటాయని ఐఎండీ తెలిపింది.
కనిష్ట ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో సాధారణం కన్నా అధికంగా ఉండనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉత్తర, ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు సెంట్రల్ ఇండియా, వాయువ్య భారతంలో రెండు లేదా నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రత దినాలు నమోదు కానున్నట్లు తెలిపారు.
సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇండియాలో నాలుగు నుంచి ఏడు హీట్‌వేవ్ డేస్ ఉంటాయని, ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వాయువ్య ప్రాంతంలో ఈసారి హీట్‌వేవ్ రోజుల సంఖ్య రెట్టింపు కానున్నట్లు ఐఎండీ అధికారి తెలిపారు. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, చత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఏపీ, తమిళనాడుతో పాటు కర్నాటక ఉత్తర ప్రాంతంలో నార్మల్ కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
ఈ వేసవి కాలంలో దేశవ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ పెరగనున్నట్లు మహాపాత్ర తెలిపారు. హీట్‌వేవ్ అధికంగా ఉండే కారణంగా.. ఈ సీజన్‌లో సుమారు 10 శాతం వరకు విద్యుత్తు డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. గత ఏడాది మే 30వ తేదీన దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల వినియోగం జరిగిందని, ఇది 6.3 శాతం ఎక్కువ అని తెలిపారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్