
పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పి-4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదివారం అమరావతి వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీ-4 లోగోను వారు ఆవిష్కరించారు. అదేవిధంగా swarnaandhrap4@ap.gov.in మెయిల్ ఐడీ, 8008944791 ఫోన్ నంబర్తో ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు.
పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్‌షిప్‌గా ఈ విధానం ఉండనుంది. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. మార్గదర్శి- బంగారు కుటుంబం నినాదంతో పీ-4 కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టారు.
మంగళగిరికి చెందిన గొర్రెల కాపరి కడియం నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలను సత్కరించి వారికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రశంసా పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం, మార్గదర్శకులకు గొర్రెల కాపరి కడియం నరసింహ తన కుటుంబ వివరాలను వివరించారు. ఈ క్రమంలో నరసింహ ఇద్దరి పిల్లల్ని మంచి ప్రైవేట్ పాఠశాలలో చేర్పించి రవాణా ఖర్చులు భరిస్తానని గ్రీన్కో అధినేత చలమలశెట్టి అనిల్కుమార్ హామీ ఇచ్చారు. తన కూతురు మెడిసిన్ చదువు కోసం కుమారుడిని చదువును ఆపించాల్సి వచ్చిందని ఇమ్మాన్యుయెల్ పేర్కొన్నారు.
అతడిని కూడా చదువు మాన్పించి భవన నిర్మాణ పనులకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పేదరికంలో పుట్టిన వారికి మంచి వైద్యం అందించాలనే లక్ష్యంతోనే వైద్య విద్య అభ్యసిస్తున్నానని ఇమ్మాన్యుయెల్ కుమార్తె అలేఖ్య వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇమ్మాన్యుయల్ పిల్లల చదువుకు సహాయం అందించేందుకు పారిశ్రామికవేత్త సజ్జన్కుమార్ గోయంకా అంగీకారం తెలిపారు.
సమాజం ఇచ్చిన గుర్తింపుకు కృతజ్ఞతగా తిరిగి సమాజానికి ఏదోకటి చేయాలనే నినాదమే పీ-4 అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రతీ ఒక్కరూ దీనికోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కుడున్నా రాణించాలనేదే చంద్రబాబు ఆకాంక్షని పవన్ కల్యాణ్ తెలిపారు. తన ఆశయం కూడా అదేనని పేర్కొన్నారు. పీ-4 అంటే ఉదారంగా డబ్బులిచ్చేయడం కాదని అందరి సహకారంతో నిరుపేద కుటుంబాలని పైకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం