అర్బన్ నక్సలైట్ల పేరు మీద పట్టణాల్లో తిష్ట

అర్బన్ నక్సలైట్ల పేరు మీద పట్టణాల్లో తిష్ట
 
భారత హోం మంత్రి అమిత్ షా  2026 మార్చిలోగా దేశంలో నక్సలిజం అంతం చేస్తామని చెబుతున్నప్పటికీ దేశంలోని నక్సలైట్లు తమ రంగు మార్చుకొని అర్బన్ నక్సలైట్ల పేరు మీద పట్టణాల్లో తిష్ట వేస్తున్నారని పలువురు నిపుణులు హెచ్చరించారు. 
 
ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో మృతవీరుల స్మారక పరిశోధన సంస్థ (ఎంఎంఆర్ఐ)  ఆధ్వర్యంలో `మారుతున్న నక్సలిజం రంగులు” అంశంపై శనివారం జరిగిన సెమినార్ లో ప్రసంగిస్తూ  అడవుల్లో ఉండే నక్సలైట్లు పంథా మార్చుకొని అర్బన్ నక్సలైట్ల పేరు మీద సమాజంలో మేధావుల ముసుగులో తిష్ట వేశారని తెలిపారు.
 
ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు పి మురళి మోహన్ అధ్యక్షత వహించగా లోక్ సత్తా వ్యవస్థాపకులు డా. జయప్రకాశ్ నారాయణ్, మాజీ డిజిపి కె అరవిందరావు, మాజీ ఐఏఎస్ అధికారి, ప్రముఖ సంచార జాతుల ఉద్యమనేత డా. దాసరి శ్రీనివాసులు, సామాజిక సమరసత జాతీయ సంయోజక కె శ్యామ్ ప్రసాద్, నెహ్రూ యువ కేంద్ర మాజీ ఉపాధ్యక్షులు పేరాల చంద్రశేఖర్ రావు ప్రసంగించారు.
 
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మమ్మల్ని మనల్ని మనం పాలించుకుంటామని రాజ్యాంగాన్ని రూపొందించుకున్న రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వాలను కూలదోసి తుపాకి రాజ్యాన్ని స్థాపిస్తాం అనడం మూర్ఖత్వం అని వారి విమర్శించారు . నక్సలైట్లను, పోలీసులను గుర్తుపెట్టుకుంటున్నాం కానీ వారి మధ్యలో నలిగిపోయిన గిరిజనులను గుర్తించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇన్ ఫార్మర్ల నెపంతో చాలామంది గిరిజనులను నక్సలైట్లు చంపివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యం చేయాలనుకునే చాలామంది అధికారులను కూడా నక్సలైట్లు అంతం చేశారని చెప్పారు. నక్సలిజం రెండు రకాలు అని పేర్కొంటూ ఒకటి హార్డ్ వేర్ అంటే నిర్ములించడం,  నక్సలిజానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపడం అని చెప్పారు.
 
మరొకటి సాఫ్ట్ వేర్ అని పేర్కొంటూమనుషుల ఆలోచన విధానాన్ని నక్సలిజానికి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేయడంగా తెలిపారు. ఈరోజు యూనివర్సిటీల్లో చూస్తే ఎక్కువ భాగం ప్రొఫెసర్లు వామపక్ష భావజాలం చెందినవారు ఉంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.నక్సలిజాన్ని అంతమొందించే పద్ధతులను మనం అలవర్చుకోవాలి అని వారు సూచించారు.
 
నక్సలిజాన్ని రూపుమాపి మన దేశ యువతను, సైనిక బలగాలను, పౌరులను నక్సలిజం పేరు మీద జరిపే మారణహోమం నుండి కాపాడుకునేందుకు సమిష్టి కృషి అవసరం అని తెలిపారు. దేశ ఐక్యత సమాజం కోసం ప్రాణాలర్పించిన ప్రజలకు అధికారులకు తొలుత శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ల హింసాకాండలో అమరులైన వారిని స్మరించుకుంటూ, వారి హింసాకాండపై, నక్షలైట్ల బాధితుల గురించి పరిశోధనలు జరిపేందుకు ఎంఎంఆర్ఐని 1991 డిసెంబర్ లో ప్రారంభించారు.