ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న శ్రవణ్‌రావు శనివారం సిట్‌ ముందు విచారణకు హాజరయ్యారు. మార్చి 29న తెల్లవారుజామున దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన, విచారణ కోసం జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. పోలీసుల విచారణకు సహకరించాలని శ్రవణ్‌రావును సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశిస్తూ, ఆయనను అరెస్టు చేయొద్దని తెలిపింది. 

శ్రవణ్‌ను విచారణ చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావును ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఎక్కడ కొనుగోలు చేశారు? సర్వర్ కేంద్రాలను ఎవరు చెబితే ఏర్పాటు చేశారు? అనే విషయాలపై గత ప్రభుత్వంలో ఉన్న పరిచయాలపై జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలిసింది.

శ్రవణ్ రావు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎవరెవరితో టచ్లో ఉన్నారు? అనే విషయాలపై కూడా పోలీసులు ఆరా తీసినట్లుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చిన తర్వాత పరారైన శ్రవణ్ రావు విదేశాల్లో ఏయే ప్రాంతాల్లో తలదాచుకున్నారు? అనే విషయాలపై ప్రశ్నించినట్లుగా తెలిసింది. ఎవరెవరితో శ్రవణ్రావు సంప్రదింపులు జరిపారు అనే దానిపై కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఆరా తీసినట్లుగా సమాచారం. 

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రదారి ఎవరు? అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలిసింది.  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆరో నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకున్న ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు అరువెల శ్రవణ్‌రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఇటీవల నోటీసు జారీ చేసింది. నోటీస్‌ ప్రతిని ఈనెల 26న హైదరాబాద్‌లోని ఆయన కుటుంబసభ్యులకు అందజేసింది.

2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు వెళ్లారు. వెంటనే అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్‌ విచారణకు రాకుండా గత కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై అమెరికాలో రెడ్‌కార్నర్‌ నోటీస్‌ సైతం జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ శ్రవణ్ రావు ఇటివలే సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు.

దానిపై ఈనెల 24న జరిగిన విచారణలో శ్రవణ్ రావును అరెస్ట్‌ చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది. కానీ ధర్మాసనం పోలీసుల దర్యాప్తునకు సహకరించాలనే షరతు విధించింది. అందుకు పిటిషనర్‌ న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే ఆయన 48 గంటల్లోగా భారత్‌కు తిరిగి వస్తారని సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలోనే 72(3 రోజులు) గంటల గడువు విధిస్తూ శనివారం తమ వద్ద విచారణకు రావాలని సిట్‌ స్పష్టం చేసింది. దీంతో ధర్మాసనానికి ఇచ్చిన హామీ ప్రకారం శ్రవణ్‌రావు ఈ రోజు విచారణకు హాజరయ్యారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నడుచుకున్నారనేది తెలంగాణ దర్యాప్తు సంస్థ ప్రధాన అభియోగం. 

శ్రవణ్ రావు తాను చేసిన సర్వే ఆధారంగానే పలువురిపై నిఘా ఉంచాలని కీలక నిందితులకు సూచించారని ప్రాథమిక ఆధారాలను బట్టి దర్యాప్తు అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 2023 తెలంగాణ శాననసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు లబ్ది చేకూర్చేందుకే కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావు సూచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

శ్రవణ్ రావును విచారించడం ద్వారా ఈ విషయాలపై స్పష్టత రానున్నట్లు భావిస్తున్నారు. మీడియాలో పనిచేస్తూ బిఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చాల్సిన అవసరమెందుకనే విషయాన్ని తేల్చడం ద్వారా ఈ కేసు కీలక మలుపు తిరుగుతుందని దర్యాప్తు అధికారులు నమ్ముతున్నారు. ఇదే జరిగితే ఫోన్ ట్యాపింగ్ వెనుక రాజకీయ ప్రముఖుల పాత్ర బహిర్గత అవుతుందనేది వారి భావనగా కనిపిస్తుంది.