పుతిన్‌ లగ్జరీ కారులో భారీ పేలుడు

పుతిన్‌ లగ్జరీ కారులో భారీ పేలుడు
 
* రష్యా అధ్యక్షుడి భద్రతపై అనుమానాలు
 
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కు చెందిన అధికారిక కార్లలో అత్యంత లగ్జరీ కారు అయిన లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. మాస్కో నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రష్యా అధ్యక్షుడి భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. పుతిన్‌పై హత్యాయత్నం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో ప్రపంచ నేతలంతా ఉలిక్కిపడ్డారు.

రష్యా మీడియా వెల్లడించిన కథనాల ప్రకారం పుతిన్‌కు చెందిన అత్యంత ఖరీదైన కారు లిమోజిన్‌ లుబియాంకాలోని ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయం సమీపంలో కాలిపోతూ కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారు ఇంజిన్ నుంచి మంటలు ప్రారంభమై వాహనంలోకి వ్యాపించాయి.  అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అక్కడికి సమీపంలోని రెస్టారెంట్‌లోని సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుంచి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతినడాన్ని చూడవచ్చు. 

ఈ పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రష్యన్‌ మీడియా పేర్కొంది. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తుంటుందని తెలిపింది. పేలుడుపై దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ ల మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో ఈ పేలుడు ఆందోళన కలిగిస్తున్నది.

పైగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ వాఖ్యానించిన మూడు రోజులకు ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరింపచేసుకుంది. గత బుధవారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇప్పుడు పుతిన్‌ కారు తగలబడిన ఘటన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి మరణాన్ని జెలెన్‌స్కీ ముందే ఊహించారంటూ కథనాలు వెలువడుతున్నాయి. 

అయితే ఈ పేలుడు జరిగిన సమయంలో పుతిన్ సమీపంలో ఉన్నారా? అనే విషయమై స్పష్టత లేదు. అయితే ఎవ్వరూ గాయపడలేదని చెబుతున్నారు.  పైగా, రష్యా సీక్రెట్ సర్వీస్ విభాగం ఎఫ్‌ఎస్‌బీ ప్రధాన కార్యాలయంపై కొద్దీ మీటర్ల దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు, ఉక్రెయిన్ – రష్యా మధ్య కొనసాగుతున్న నల్ల సముద్రం కాల్పుల విరమణ చర్చల గురించి పెరుగుతున్న ఊహాగానాల మధ్య జెలెన్స్కీ వ్యాఖ్యలు వచ్చాయి. ఈ చర్చలు అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగాయి. 

“ప్రపంచ స్థాయిలో పుతిన్ ఈ ఒంటరితనం నుండి బయటపడటానికి అమెరికా ఇప్పుడు సహాయం చేయకపోవడం చాలా ముఖ్యం. ఇది ప్రమాదకరమైనదని నేను నమ్ముతున్నాను. ఇది అత్యంత ప్రమాదకరమైన క్షణాలలో ఒకటి.  వ్లాదిమిర్ పుతిన్ తన ప్రాణాలకు భయపడుతున్నాడు. కానీ అతను త్వరలోనే చనిపోతాడు. అది వాస్తవం. ప్రతిదీ అయిపోతుంది” అని జెలెన్స్కీస్పష్టం చేయడం జరిగింది.