ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ప్రభుత్వాలు మరీ అప్పులు తీసుకొస్తున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పరిధికి మించి రుణాలు చేస్తే అప్పులు కూడా పుట్టని స్థితికి వస్తారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి అప్పులు చేసే విధానం రావాలని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాయకులు పరిస్థితులు గమనించాలని సూచించారు.
విజయవాడలో ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొంటూ ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై పాలకులు దృష్టి పెట్టాలని తెలిపారు. భావితరాల గురించి ఆలోచించాలని వివరించారు. విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మన భవిష్యత్‌కు మనమే ఓటు వేస్తున్నామనే విషయాన్ని ప్రజలు గమనించాలని వెంకయ్యనాయుడు వెల్లడించారు.
“అదేవిధంగా రాజకీయ నాయకులపై నమోదైన ఆర్థిక నేర కేసులను వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. అలా కాకుండా రెండేళ్లలోగా వాటిని పరిష్కరించేలా ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలి. సామాన్యులకు అన్ని వాయిదాలు ఉండడం లేదు. కానీ అవినీతి, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఒక ఎన్నిక తర్వాత మరొక ఎన్నిక జరుగుతున్నా బెయిల్‌మీద బయట తిరుగుతున్నారు” అంటూ విచారం వ్యక్తం చేశారు.
న్యాయవ్యవస్థకు తగిన వసతులు కల్పించి ఈ తరహా కేసుల పరిష్కార విషయంలో ప్రభుత్వం తగిన చొరవ చూపాల్సి ఉందని చెప్పారు. “దక్షిణాది రాష్ట్రాలు జనాభా అదుపులో పెట్టుకుంటున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ పాటిస్తున్నందున జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిపితే తమకు నష్టం కలుగుతుందనే భావనతో కొందరు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు” అంటి విచారం వ్యక్తం చేశారు.
“2026 ఎన్నికలకు ముందు జనాభా గణన జరగాల్సి ఉంది. అది ఖచ్చితంగా జరుగుతుందనే ఆశాభావం ఉంది. ఏయే రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించి ఆర్థిక క్రమశిక్షణతో ఉంటే వాటికి నష్టం కలుగుకుండా ప్రత్యేక వెయిటేజీ ఇవ్వాల్సి ఉంది. దీనిపై అన్ని పార్టీలు ప్రభుత్వ అఖిలపక్షం సమావేశం నిర్వహించాలి. ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చించాలి” అని వెంకయ్య నాయుడు సూచించారు.
రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు మంచినీళ్లు తాగినంత సులభంగా పార్టీలు మారుతున్నారని విచారం వ్యక్తం చేస్తూ పార్టీ ఫిరాయింపులు నిషేధిస్తూ చట్టం తేవాలని, పార్టీ మారిన వెంటనే పదవికి రాజీనామా చేయకపోతే వేటు పడేలా అందులో ఉండాలని స్పష్టం చేశారు. ‘ఉచితాల పేరుతో ఓట్లు వేయించుకుని, ప్రజల డబ్బు పంచుతూ నేతలు ఫొటోలు వేయించుకొంటున్నారు… రాష్ట్రాలు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.. ఆర్థిక పరిస్థితులు, ఆదాయ వనరులు అంచనా వేసిన తర్వాతే అప్పులు చేసేలా బ్రేకులు వెయ్యాలి’ అని వెంకయ్య అభిప్రాయపడ్డారు.
More Stories
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు
రేణిగుంటలోని చైనా దేశస్తుడి నివాసంలో ఈడీ సోదాలు
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని