మయన్మార్​లో 180 దాటిన మృతుల సంఖ్య

మయన్మార్​లో 180 దాటిన మృతుల సంఖ్య

భారీ భూకంపం ధాటికి మయన్మార్‌, థాయ్‌లాండ్‌ విలవిల్లాడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 186కి చేరినట్లు సమాచారం. ఒక్క మయన్మార్‌లోనే 181 మరణాలు నమోదు అయ్యాయి. 

మయన్మార్‌లో వందలాది భవనాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమవగా 144 మంది చనిపోయారని, 730 మంది గాయపడ్డారని సైన్యం ప్రకటించింది. అయితే మయన్మార్‌లో వెయ్యి మందికిపైగా చనిపోయి ఉండొచ్చని అమెరికా జియోలాజికల్‌ సర్వే అంచనా వేసింది. బ్యాంకాక్‌లో 33 అంతస్తుల భవనం సహా నిర్మాణంలో ఉన్న మరో రెండు భవనాలు కూలిపోగా 10 మంది చనిపోయారు. 16 మంది గాయపడ్డారు. శిథిలాల కింద 100మందికిపైగా చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

చైనా వివరాలు అసలు బయటకే రాలేదు. అయితే, మూడు దేశాల్లో కలిపి ప్రాణనష్టం శనివారం నాటికి భారీగా పెరగొచ్చని అనుమానిస్తున్నారు. మయన్మార్‌, థాయ్‌లాండ్‌లలో వందలాది మంది గాయపడటంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 

మయన్మార్​లో రాజధాని నెపిడాతోపాటు మరికొన్ని నగరాల్లో కనుచూపు మేరలో ఎక్కడచూసినా కూలిన భవనాలు, బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మృతుల సంఖ్య వందల్లో ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మయన్మార్​లోని ఓ ఆస్పత్రి శవాల దిబ్బను తలపిస్తోంది.  

నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం నిలువునా కూలిపోయిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను నిరుత్తరులను చేశాయి. అంతపెద్ద భవనం క్షణాల్లో సిమెంటు రాళ్లు, ఇనుప తీగలకుప్పగా మారింది. ఈ ఒక్క భవనంలోనే 43 మంది నిర్మాణ కార్మికులు చిక్కుకున్నారని అంటున్నారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారి ఆర్తనాదాల వీడియోలు సోషల్‌ మీడియాలో తిరుగుతున్నాయి.

భూకంపం ధాటికి మయన్మార్​లో అనేక భవనాలతోపాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది.  ఐరావతి నది మీద మాండలే నగరంలో 90 ఏళ్ల క్రితం కట్టిన ప్రఖ్యాత అవా వంతెన కుప్పకూలిపోయింది. దాంతో మాండలేకు, మయన్మార్‌ అతిపెద్ద నగరం యాంగూన్‌కు మధ్య రాకపోకలు దెబ్బతిన్నాయి.

మాండలే, సాగింగ్ నగరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతోపాటు టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగినట్లు రెడ్ క్రాస్ కటించింది. విద్యుత్తు సరఫరా లేకపోవటం వల్ల సహాయక చర్యలకు ప్రతికూలంగా మారినట్లు తెలిపింది. మయన్మార్​లో చాలాచోట్ల గుళ్లు, గోపురాలు కుప్పకూలాయి.  మయన్మార్‌, థాయ్‌లాండ్‌లకు కావాల్సిన మందులను పంపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.