మయన్మార్ కు 15 టన్నులు సహాయ సామగ్రి

మయన్మార్ కు 15 టన్నులు సహాయ సామగ్రి
భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు భారత్‌ అపన్నహస్తం అందించింది. మయన్మార్‌ను ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు ఆ దేశాన్ని ఆదుకునేందుకు దాదాపు 15 టన్నులు సహాయ సామగ్రిని పంపింది. 
 
భూకంప బాధితులను ఆదుకునేందుకు టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, దుప్పట్లు, ఆహారం, నీటి శుద్ధి చేసే పరికరాలు, సౌర దీపాలు, జనరేటర్ సెట్లుతో పాటు మందులను పంపింది. ఈ మేరకు సహాయ సామగ్రిని సైనిక రవాణా విమానంలో కేంద్రం పంపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హిండన్ వైమానిక దళ కేంద్రం నుంచి వైమానిక దళానికి చెందిన సి130జె విమానం మయన్మార్‌ వెళ్లింది.

అంతకుముందు మయన్మార్‌, థాయ్‌లాండ్‌లను వణికించిన భూకంపాలపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ రెండు దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మయన్మార్‌, థాయ్‌లాండ్‌లలో భూకంప పరిస్థితులపై ఆందోళనగా ఉందని, అక్కడి ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్‌ మాధ్యమంలో పోస్ట్ చేశారు. 
 
ఆ రెండు దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సహాయక చర్యలపై మయన్మార్‌, థాయ్‌లాండ్‌లతో నిరంతరం సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరినట్టు మోదీ తెలిపారు.