ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు భారీగా తగ్గుముఖం

ఐఐటీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు భారీగా తగ్గుముఖం
దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2021-22తో పోలిస్తే 2023-24లో ఐఐటీ (బీహెచ్‌యూ) మినహా 23 ఐఐటీల్లో 22 చోట్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల ప్లేస్‌మెంట్లతో క్షీణత నమోదైంది.  ఈ జాబితాలో 25శాతం తగ్గుదలతో ఐఐటీ ధార్వాడ్‌ టాప్‌లో ఉండగా, 2.88శాతం తగ్గుదలతో ఐఐటీ ఖరగ్‌పూర్‌ చివరి స్థానంలో నిలిచింది.
15 ఐఐటీల్లో ప్లేస్‌మెంట్‌ రేటు 10 శాతానికి పైగా తగ్గింది. ఈ మేరకు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి సమర్పించిన నివేదికలో కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది.
2021-22, 2023-24 మధ్య ఐఐటీలు, ఐఐఐటీల్లో ప్లేస్‌మెంట్లు అసాధారణంగా తగ్గాయని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదికలో కమిటీ పేర్కొంది. మార్కెట్‌ ధోరణులకు అనుగుణంగా నియామకాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని, విద్యార్థులు ఉన్నత విద్యకు మొగ్గు చూపడం, స్టార్ట్‌పల వైపు మళ్లడం కూడా ప్లేస్‌మెంట్ల రేటు తగ్గడానికి కారణమని అభిప్రాయపడింది.
 
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని, 2022-23, 2023-24 మధ్య విద్యార్థులకు అందిన సగటు వేతన ప్యాకేజీల్లో తగ్గుదల నమోదైందని తెలిపింది. ఉద్యోగావకాశాలు పెంచడానికి ఉన్న మార్గాలను అన్వేషించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖను కమిటీ కోరింది. 
 
ఐఐటీల్లో 2024-25 ప్లేస్‌మెంట్ల సీజన్‌ ఈ ఏడాది జూన్‌ 30 వరకూ కొనసాగనుంది. ఈ నివేదిక ప్రకారం ఐఐటీ(బీహెచ్‌యూ) వారాణసీలో ప్లేస్‌మెంట్‌ రేటు 83.15 శాతం నుంచి 88.04 శాతానికి పెరిగింది. ఈ ఒక్క చోట మాత్రమే 4.89 శాతం పెరుగుదల నమోదైంది. 
 
ఐఐటీ ధార్వాడ్‌లో ప్లేస్‌మెంట్లు 90.20 శాతం నుంచి 65.56 శాతానికి, ఐఐటీ జమ్ములో 92.08 శాతం నుంచి 70.25 శాతానికి, ఐఐటీ రూర్కీ 98.54 శాతం నుంచి 79.66 శాతానికి తగ్గాయి. 2021-22లో మొత్తం 23 ఐఐటీలకు గాను 14 చోట్ల 90 శాతానికి పైగా ప్లేస్‌మెంట్లు నమోదవగా 2023-24లో 3 ఐఐటీలు (జోధ్‌పూర్‌, పట్నా, గోవా) మాత్రమే 90 శాతం మార్కును దాటాయి. 2022-23తో పోలిస్తే 2023-24లో తిరుపతి, గాంధీనగర్‌, ఖరగ్‌పూర్‌ ఐఐటీల్లో ప్లేస్‌మెంట్ల శాతం పెరిగింది.