
వచ్చే గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2026 జూన్ నెల నాటికి ఎడవ కాలువను పూర్తి చేస్తామని చెప్పారు. ఇతర చిన్న పనులను సైతం 2027 డిసెంబర్‌కు పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.
శుక్రవారం పోలవరం సందర్శించి ప్రాజెక్ట్ పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి ఇప్పటికి రూ.829 కోట్లు నేరుగా నిర్వాసితుల ఖాతాలో వేసిన ఘనత తమ ప్రభుత్వానిదని చంద్రబాబు చెప్పారు. పోలవరంలో నీళ్లు వదిలే ముందే, 2027 నవంబర్ నాటికి పునరావాసం పూర్తి చేస్తామని కూడా సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు.
పోలవరం ప్రాజక్టులో భూములు కోల్పోయిన బాధితులకు పునరావాసాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చేస్తామని తేల్చి చెప్పారు. మన ఎన్డీయే ప్రభుత్వం వచ్చిందని, సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేసుకుందామని పేర్కొన్నారు.
దళారులు, మోసగాళ్లకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటామని నిర్మాణంలో ఆలస్యం వల్ల హైడల్ ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని చంద్రబాబు చెప్పారు. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం పైసా కూడా విదల్చలేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్వాసితులు వేల ఎకరాల్లో భూములు త్యాగం చేశారని గుర్తు చేస్తూ భూములు ఇచ్చినోళ్లను గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ పక్కన పెట్టారని, ఈ ప్రాజెక్టు సొమ్మును ఇతర పథకాలకు మళ్లించారని ధ్వజమెత్తారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో బాబు ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పై విధంగా వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు.
పోలవరంలో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను మళ్లీ నిర్మించాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. డయాఫ్రమ్‌వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. 2020లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027 డిసెంబర్‌కు పూర్తయ్యే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. రాజకీయ కక్షతో రివర్స్ టెండర్ల పేరుతో గత పాలకులు ప్రాజెక్టుపై కక్ష తీర్చుకున్నారని మండిపడ్డారు.
” పోలవరం ప్రాజెక్టుని నిపుణుల కమిటీ పరిశీలించింది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ మళ్లీ నిర్మించాలి. డిసెంబర్ 31 నాటికి డయాఫ్రమ్‌వాల్ పూర్తి చేస్తాం. ఇతర పనులన్నీ డిసెంబర్ 26 నాటికి పూర్తి చేస్తాం. ఎడమవైపు అనుసంధానం జూన్ 26 నాటికి ముగిస్తాం. కుడివైపు అనుసంధానాలు చాలా వరకు పూర్తయ్యాయి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
“ఫిబ్రవరి 26 నాటికి ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్ -1, అలాగే 2027 డిసెంబర్ నాటికి ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్ -2 డ్యామ్ పూర్తి చేస్తాం. పుష్కరాల సమయానికి ప్రాజెక్టు పూర్తయితే ఉపయోగపడుతుంది. సాంకేతిక సమస్యలు ఉంటే ప్రాజెక్టు కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పటివరకు భూసేకరణ చాలా వరకు పూర్తయింది” అని సీఎం చంద్రబాబు తెలిపారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు