
దేశంలో 25 వేల కిలోమీటర్ల మేర రెండు లైన్ల జాతీయ రహదారులను నాలుగు లైన్లుగా మారుస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రూ.10 లక్షల కోట్లతో ఈ పనులు చేపడతామని, తద్వారా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభలో మాట్లాడుతూ రూ. 6 లక్షల కోట్లతో 16 వేల కిమీ జాతీయ రహదారులను ఆరు లైన్లుగా మార్చుతామని చెప్పారు.
“వీటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయి. రెండేళ్లలో పనులు పూర్తవుతాయని భావిస్తున్నాం” అని చెప్పారు. మరోవైపు దేశంలో ఏటా 4.80 లక్షల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఇటీవల గడ్కరీ వెల్లడించారు. వీటిలో 18 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన 1.88 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.
ఈ ప్రమాదాల కారణంగా దేశ జీడీపీ ఏటా 3 శాతం నష్టపోతోందని చెప్పారు. 2030 నాటికి ఈ ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మోదీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
జమ్ముకశ్మీర్‌లో రూ. 2 లక్షల కోట్లతో రోడ్డు పనులు జరుగుతున్నాయని, సులువుగా ప్రయాణం సాగేందుకు వీలుగా 105 సొరంగాలు నిర్మాణమవుతున్నాయని పేర్కొన్నారు. ఆసియా లోనే చాలా పొడవైన సొరంగం జీరో కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండే జోజిలాలో నిర్మాణమవుతోందని, మొదట ఈ సొరంగం నిర్మాణానికి రూ.12,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా, ఇప్పుడు కేవలం రూ. 5500 కోట్ల తోనే నిర్మాణం పూర్తవుతోందని చెప్పారు.
జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో 36 సొరంగాలు నిర్మాణం కానున్నాయని వీటిలో 22 సొరంగాలు నిర్మాణం పూర్తి కావస్తోందని తెలిపారు. ఇది పూర్తయితే జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారి మధ్య ప్రయాణ సమయం మూడు నుంచి మూడున్నర గంటలకు తగ్గుతుందని, ప్రస్తుతం ఏడు గంటలు పడుతుందని తెలిపారు.
ఢిల్లీ ఖాత్రా ఎక్స్‌ప్రెస్ వే పనుల పురోగతిని వివరిస్తూ ఈ మార్గంలో ప్రస్తుతం ప్రయాణానికి 12 గంటలు పడుతుండగా, పనులు పూర్తయితే సగానికి సమయం తగ్గుతుందని వివరించారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం