
“మీరు వాగ్దానం చేసిన మేరకు సుపరిపాలనను అందిస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నాము. ఈ రకమైన మితిమీరిన అవినీతి, లంచాలను ప్రోత్సహించడానికి మాత్రం కాదు” అంటూ సిద్ధరామయ్య సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి గత ప్రభుత్వాలు కూడా బాధ్యులేనని మోహన్‌దాస్ స్పష్టం చేశారు.
అధికారంలో ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి బాధ్యత దానిపైనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవినీతి, లంచాల సంస్కృతిని ఇకనైనా అడ్డుకోండి అని ఆయన కోరారు. ‘ఈ వేధింపులు, అంతులేని అవినీతి నుంచి మమల్ని కాపాడండి’ అని వ్యాపారుల తరఫున ఆయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
కాగా, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన బెంగళూరు నగర రోడ్లు మరోసారి వార్తలకెక్కాయి. బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా పోస్టు చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. బెంగళూరు రోడ్ల దుస్థితిపై ఆమె ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్వెడార్‌లోని శాన్ క్రిస్టోబాల్ ద్వీపంలోని రోడ్లే ఇంత కన్నా మెరుగ్గా ఉన్నాయంటూ ఆమె పోలిక తీసుకువచ్చారు. క్రిస్టోబాల్ ద్వీపంలోని పరిశుభ్రమైన వీధులు, చక్కని రోడ్లను చూపించే ఓ వీడియోను ఆమె షేర్ చేస్తూ ‘బెంగళూరు.. సిగ్గుతో తలదించుకో’ అంటూ మజుందార్ చురకలు అంటించారు.
బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంసీ) ప్రత్యేక కమిషనర్‌ని ట్యాగ్ చేస్తూ ఆమె చేసిన ట్వీట్ ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కిరణ్ వైఖరిని కొందరు సమర్థించగా మరికొందరు భిన్నంగా స్పందించారు. ఐటీ హబ్ నగరమైన బెంగళూరు కన్నా అనేక భారతీయ నగరాలలో మౌలిక సౌకర్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.
ఈక్వెడార్ అంత దూరం వెళ్లనవసరం లేదు.. మైసూరు, ఇండోర్, సూరత్, రాజ్‌కోట్‌లను సందర్శిస్తే చాలు అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించారు. దీనికి కిరణ్ షా సమాధానమిస్తూ అయితే వర్థమాన దేశమైన ఈక్వెడార్‌లో స్థానిక మున్సిపాలిటీ ఎంత చక్కగా పనిచేస్తోందో చెప్పడమే తన ఉద్దేశమని తెలిపారు.
పౌర సమస్యల కన్నా ప్రజలకు భాషా రాజకీయాలే ఎక్కువై పోయాయని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రాథమిక హక్కుల కోసం పోరాడడం మాని కన్నడలో మాట్లాడడం గురించే ప్రజలు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని, దురదృష్టవశాత్తు బెంగళూరులో ప్రాథమిక సౌకర్యాలు ఎన్నటికీ ఏర్పడబోవని ఆ నెటిజన్ అభిప్రాయపడ్డారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు