కేంద్ర మాజీ మంత్రి యత్నాల్‌ బిజెపి నుండి బహిష్కరణ

కేంద్ర మాజీ మంత్రి యత్నాల్‌ బిజెపి నుండి బహిష్కరణ
కర్ణాటక నేత, కేంద్ర మాజీ మంత్రి బసనగౌడ పాటిల్ యత్నాల్‌ను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. పార్టీతోపాటు మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్పకు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. బీజేపీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. 
 
కర్ణాటకలోని విజయపుర ఎమ్మెల్యే అయిన బసనగౌడ పాటిల్ యత్నాల్‌ గతంలో మాజీ సీఎం బీఎస్‌ యుడియూరప్పకు సన్నిహితుడిగా పేరుపొందారు. అయితే బసవరాజ్ బొమ్మై సీఎం అయిన తర్వాత యుడియూరప్ప, ఆయన కుమారుడిని బహిరంగంగా విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా యడియూరప్ప కుమారుడిని ఎన్నుకోవడంపై బాహాటంగా ఆరోపణలు చేశారు.

బసవగౌడ పాటిల్ యత్నాల్ కొద్దికాలంగా పదేపదే వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన రన్యారావుపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రపై కూడా ఆయన కయ్యానికి కాలుదువ్వారు. విజయేంద్ర అవినీతి, ఎడ్జెట్‌మెంట్ పాలిటిక్స్‌‌కు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. 

దీనిపై గత ఫిబ్రవరి 18న కేంద్ర క్రమశిక్షణా కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు పంపింది. ఆయన ప్రతిస్పందనను సెంట్రల్ డిసిప్లినరీ కమిటీ పరిశీలించింది. ఈ నేపథ్యంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఆయనను ఆరేళ్లపాటు బీజేపీ నుంచి బహిష్కరించింది. బుధవారం ఈ మేరకు నోటీస్‌ జారీ చేసింది.

యత్నాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం ద్వారా అంతర్గత క్రమశిక్షణకు పార్టీ కట్టుబడి ఉంటుందని బీజేపీ సంకేతాలు ఇచ్చింది.  యత్నాలు తొలగింపుతో కర్ణాటక రాజకీయాలపై ముఖ్యంగా ఆయనకు మంచిపేరున్న విజయపురలో పార్టీపై ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి తనను తొలగించడంపై బసనగౌడ పాటిల్ యత్నాల్‌ స్పందించారు.

వారసత్వ రాజకీయాలు, పార్టీలో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనకు శిక్ష విధించారని ఆరోపించారు. సంస్కరణలను సమర్థించడం, నిరంకుశ నాయకత్వాన్ని సవాల్‌ చేయడం, ఉత్తర కర్ణాటక అభివృద్ధిని కోరడం వంటి కారణాల వల్ల కొన్ని శక్తులు తనను లక్ష్యంగా చేసుకున్నాయని మండిపడ్డారు. బీజేపీ నుంచి తనను బహిష్కరించినప్పటికీ వీటిపై తన పోరాటాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు.