
భారత – అమెరికాల మధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులు జరుగుతున్నాయి. తొలి దశలో అమెరికా దిగుమతులలో సగం అంటే దాదాపు రూ.1.97 లక్షల కోట్ల (23 బిలియన్ డాలర్లు) విలువైన దిగుమతి సుంకాలపై కోత విధించాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. అమెరికాకు జరిగే రూ.5.65 లక్షల డాలర్ల (66 బిలియన్ డాలర్లు) ఎగుమతులను రక్షించుకోవాలని ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున సుంకాలను తగ్గించడం ఇదే ప్రథమం.
ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా పరస్పర సుంకాలను తీవ్రంగా పెంచుతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 2నుంచి సుంకాల పెంపు అమలులోకి వస్తుంది. దీంతో ఆ ప్రభావాన్ని తగ్గించాలని మనదేశం భావిస్తోంది. విపరీతంగా సుంకాల పెంపువల్ల అంతర్జాతీయ మార్కెట్లు కుదేలయ్యే ప్రమాదం ఉంది. అలాగే పశ్చిమ దేశాలలోని మిత్ర దేశాల విధాన రూపకర్తలు ఇబ్బందుల పాలవుతారు.
భారత్ అమెరికాకు 66 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. పరస్పర సుంకాల వల్ల అమెరికాకు చేసే మొత్తం ఎగుమతుల్లో 87 శాతంపై ప్రభావం ఉంటుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంప్రదింపులలో ఉన్న ఒప్పందం ప్రకారం భారతదేశం దిగుమతి చేసుకునే అమెరికా వస్తువులపై సుంకాలను దాదాపు 55 శాతం తగ్గించడానికి సిద్ధమయింది.
భారతదేశం అమెరికాకు చేసే ఎగుమతుల్లో ముత్యాలు, ఖనిజ ఇంధనాలు, యంత్రాలు, బాయిలర్లు, విద్యుత్ పరికరాల వంటి వస్తువులో సగం వరకూ ఉన్నాయి. పరస్పర సుంకాల విధానం కారణంగా ఈ వస్తువుల పై సుంకాలు, 6 నుంచి 10 శాతం పెరుగుతాయి. 11 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన ఔషధాలు, ఆటోమోటివ్ ఎగుమతులపై ఈ సంకాల ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.
ప్రస్తుతం అమెరికా దిగుమతులపై భారత్ 5 శాతం నుంచి 30 శాతం వరకు సుంకాలు విధిస్తోంది. కొన్ని సుంకాలను తగ్గించి, మరి కొన్నిటిపై పూర్తిగా సుంకాలు తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై సుంకాలు తగ్గించే విషయం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి వాణిజ్య చర్చలు ప్రారంభం అవుతున్నాయి.
అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులలో సగం వస్తువులపై సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఆల్మండ్లు, ఓట్‌మీల్, పిస్తాపప్పు, క్వినోవా ఉండనున్నాయి. అయితే మాంసం, మొక్కజొన్న, గోధుమలు, పాడి ఉత్పత్తులపై సుంకాలను తగ్గించబోమని భారత్ ఇదివరకే స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆటోమొబైల్స్‌పై 100 శాతం దాటిన సుంకాలను గణనీయంగా తగ్గించనుంది. అమెరికా ప్రతీకార సుంకాల వల్ల ఫార్మా, ఆటోమొబైల్స్‌తో సహా అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు