తిరిగి బిజెపి చెంతకు ఎఐఎడిఎంకె… అమిత్ షాతో సమాలోచనలు!

తిరిగి బిజెపి చెంతకు ఎఐఎడిఎంకె… అమిత్ షాతో సమాలోచనలు!
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రధాన ప్రతిపక్షం ఎఐఎడిఎంకె తిరిగి బీజేపీతో సయోధ్యకు ముందుకు వచ్చింది. రాబోయే ఎన్నికలలో ఉమ్మడిగా డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఓడించేందుకు సమాయత్తం అవుతున్నారు. 
 
ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం జరిగిపిన సమావేశంలో ఈ విషయమై కీలకమైన ముందడుగు వేశారు.  ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఎఐఎడిఎంకె నాయకుడు ఎం తంబిదురై కూడా పాల్గొన్నారు.
 
తమిళనాడులో హిందీ రుద్దడంపై వస్తున్న ఆరోపణలతో సహా వివిధ అంశాలపై వీరు చర్చించారని, ఈ విషయంలో తన పార్టీ వైఖరిని తెలియజేశారని వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పళనిస్వామి ఎన్డిఏలోకి తిరిగి రావడంపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరో రెండు-మూడు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. 
 
ఎఐఎడిఎంకె, బీజేపీ నాయకుల మధ్య గత కొన్ని వారాలుగా ఈ విషయమై సమాలోచనలు జరుగుతున్నారు. బిజెపితో తిరిగి పొత్తు పెట్టుకొనే విషయమై ఎఐఎడిఎంకె జాగురతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఉత్తరాది పార్టీతో చేతులు కలిపినదని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశలపై కూడా చర్చిస్తున్నారు.
 
ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలలో తమ ఉనికి కాపాడుకోవడం కోసం  బిజెపి అండ అవసరమని  పళనిస్వామి భావిస్తున్నట్లు చెబుతున్నారు. దక్షిణాదిన కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తులను సమీకరించడంలో స్టాలిన్ కీలకంగా వ్యవహరించడం, ఉత్తర- దక్షిణాది రాజకీయ విబేధాలు కలిగించే ప్రయత్నం చేయడంతో తమిళ ప్రజలపై చూపే ప్రభావంపై కూడా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. 
 
తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఎఐఎడిఎంకె, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 సెప్టెంబర్‌లో బిజెపితో తన పొత్తును బిజెపి  రాష్ట్ర నాయకత్వంతో విభేదాల కారణంగా తెంచి వేసుకుంది. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై దూకుడు రాజకీయాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎఐఎడిఎంకె సీనియర్ నాయకులు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ద్రవిడ ప్రముఖుడు సిఎన్ అన్నాదురైపై చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని లేదా ఆయనను ఆ పదవి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి నుండి అన్నామలై ఎఐఎడిఎంకెపై తన వైఖరిని మృదువుగా మార్చుకున్నారు. 2016లో అధినేత జె జయలలిత మరణం పార్టీ విడిపోయిన తర్వాత ఎఐఎడిఎంకె ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లో  బిజెపితో పొత్తు పెట్టుకుంది.
 
ఆ సమయంలో ఎఐఎడిఎంకె ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై బిజెపి ప్రభావం ఉన్నట్లు చాలామంది భావించారు. తమిళనాడులో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే ఘన విజయం సాధించిన తర్వాత, పళనిస్వామి బీజేపీ నుండి వైదొలిగి చివరికి 2023 సెప్టెంబర్‌లో విడిపోయారు. 
 
అయితే, 2024 లోక్‌సభ ఎన్నికలలో డీఎంకే అద్భుతమైన ప్రదర్శన, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో సహితం ఆధిపత్యం వహించడంతో పాటు ఇప్పుడు దక్షిణాదిలో బిజెపి వ్యతిరేక పక్షాలను కేంద్రీకృతం చేయడంలో స్టాలిన్ కీలకంగా వ్యవహరిస్తూ ఉండడంతో రాజకీయ భవిష్యత్ పై పళనిస్వామి అయోమయంలో పడ్డారు. 
 
మంగళవారం అమిత్ షాతో జరిపిన చర్చలలో ఎఐఎడిఎంకె, బిజెపి తీసుకున్న నిర్ణయాలలో ఒకటి డీఎంకే ప్రభుత్వానికి, స్టాలిన్‌కు వ్యతిరేకంగా, ముఖ్యంగా అవినీతి అంశంపై వ్యక్తిగత ప్రచారాలను వేగవంతం చేయడం అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
 
అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టిని మళ్లించడానికి స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన, భాషా విధానం వంటి భావోద్వేగ సమస్యలను లేవనెత్తుతున్నారని బిజెపి విశ్వసిస్తోంది. ఎఐఎడిఎంకె విధించిన షరతులలో, బీజేపీతో వ్యవహారాలను పర్యవేక్షించడానికి హై-పవర్డ్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కూడా ఉంది. ఆ విధంగా నేరుగా బిజెపి అధిష్టానంతో సంబంధాలు పెట్టుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోంది
 
ఎఐఎడిఎంకె విధించిన షరతులను ఒక సీనియర్ బిజెపి నాయకుడు ధృవీకరించారు. కానీ ఆ పార్టీ అన్నామలైను ఆ పదవి నుండి తొలగించాలని కోరకపోవడంతో రెండు పార్టీల మధ్య సామరస్య వాతావరణం నెలకొనే అవకాశాలను మెరుగు పరుస్తున్నట్లు భావిస్తున్నారు.