
ఆర్టికల్ 370 రద్దుతో ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’ అనే రాజ్యాంగ నిర్మాతల కలను నరేంద్ర మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు 70 శాతం తగ్గిపోయాయని, అక్కడ ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు చెప్పారు. రాజ్యసభలో హోంశాఖ పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా షా మాట్లాడారు.
ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల పనితీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేశాయి. అయితే, తమ ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలు కాపాడటంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రఘటనలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి” అని స్పష్టం చేశారు.
“2004-2014 మధ్య ఈ ప్రాంతంలో 7,217 ఉగ్రవాద సంఘటనలు జరిగాయి. 2014 నుంచి 2024 మధ్య ఆ సంఖ్య 2,242కి తగ్గింది. మోదీ పాలనలో కశ్మీర్‌లో ఉగ్రవాదం వల్ల మరణాలు 70 శాతం తగ్గాయి. ఉగ్రవాదాన్ని జీరో టాలరెన్స్ విధానంతో కఠినంగా అణచివేశాం” అని అమిత్ షా వెల్లడించారు.“2026 మార్చికల్లా నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. ఉగ్రఘటనలే కాకుండా రాళ్ల దాడులు కూడా తగ్గాయి. కశ్మీర్ యువకులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2019 నుంచి 2024 వరకూ యువతకు 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది” అని తెలిపారు.
పైగా, అక్కడ పెట్టుబడులు కూడా పెరిగాయని, జమ్ము కశ్మీర్‌లో ఇప్పటికే రూ.12,000 కోట్ల విలువలైన పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పారు. రూ.1.1 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు జరిగాయని పేర్కొంటూ ఇప్పుడు కశ్మీర్‌లో సాయంత్రం పూట కూడా సినిమాహాళ్లు తెరిచే ఉంటున్నాయని అమిత్ షా తెలిపారు.
ఒక విధంగా, హోం మంత్రిత్వ శాఖ చాలా క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తుందని చెబుతూ రాజ్యాంగం రాష్ట్రాలకు శాంతిభద్రతల బాధ్యతను ఇచ్చిందని, సరిహద్దు భద్రత, అంతర్గత భద్రత హోంశాఖ కిందకు వస్తాయని, ఇది సరైన నిర్ణయం అని స్పష్టం చేశారు. దీనికి ఎటువంటి మార్పులు చేయవలసిన అవసరం లేదని చెప్పారు.
అయితే, 76 సంవత్సరాల తర్వాత, శాంతిభద్రతలను రాష్ట్రాలు చూసుకుంటున్నప్పుడు, అనేక రకాల నేరాలు రాష్ట్ర సరిహద్దులకే పరిమితం కాకుండా, అవి అంతర్-రాష్ట్ర, బహుళ-రాష్ట్రాలు – మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేర ముఠాలు, హవాలా వంటివి ఒకే రాష్ట్రంలో జరగవని అమిత్ షా పేర్కొన్నారు. కొన్ని నేరాలు దేశం వెలుపల నుండి కూడా జరుగుతున్నాయని చెబుతూ ఈ దృష్ట్యా కొన్ని మార్పులు తీసుకు రావలసి వచ్చిందని వివరించారు.
More Stories
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!