నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు

నిమిషానికి రూ. కోటికి పైగా అప్పులు

రోజుకు రూ.1700 కోట్లకు పైగా కాంగ్రెస్ సర్కార్ అప్పు చేస్తోందని బిజెపి పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అప్పు రూ. 8.6 లక్షల కోట్లు ఉందని పేర్కొన్నారు. బడ్జెట్ పై శాసన సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమిషానికి రూ. కోటికి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని చెప్పారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పాతర వేసేవిధంగా ఈ బడ్జెట్ ఉందని విమర్శించారు. కులగణన సర్వేలో రాష్ట్ర జనాభా 3.54 కోట్లు తేలిందని, రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం రూ.2.27 లక్షలుగా ఉందని తెలియజేశారు. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలని ప్రశ్నించారు. యూపిఎ కంటే ఎన్డియే హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయని స్పష్టం చేశారు.

యూపిఎ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 32 శాతం వాటా ఉండేదని, యూపిఎ హయాంలో కేంద్ర పన్నుల్లో వాటా 2-3 శాతం కూడా పెంచలేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో 10 శాతం పెంచి 42 శాతం చేశారని పేర్కొన్నారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు చేపట్టడం లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గతంలో చేసిన ఆరోపణలు వాస్తవం కాదా? అని ఆయన నిలదీశారు. వాస్తవం అయితే తగు చర్యలు చేపట్టి, గతంలో దోచుకున్న మొత్తాలను స్వాధీనం చేసుకొని ఆరు గ్యారంటీలను అమలు పరచాలని ప్రభుత్వాన్ని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. 
 
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చడంతో తాము కూడా అదేదారిలో పోతాం అన్నట్లుగా ఈ ప్రభుత్వ వ్యవహారం ఉందని ఆయన విమర్సించారు. ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటె అప్పుల వివరాలు చెప్పండి అని నిలదీశారు. సుపరిపాలన, సంక్షేమం కనిపించడం లేదంటూ ఇది కమీషన్ల ప్రభుత్వంగా మారిపోయిందని ఆయన ఆరోపించారు.
 
తెలంగాణ నమూనా అంటే కూల్చివేతలు, కమీషన్లు, హామీల ఎగవేత్తలా? అని ఆయన ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో లేని ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీలను గాలికి వదిలివేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. ఫోర్త్ సిటీ పేరుతో లంకెబిందెలకోసం ఈ ప్రభుత్వం పాకులాడుతున్నదని అంటూ మండిపడ్డారు.