18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆరు నెలలపాటు సస్పెండ్‌

18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆరు నెలలపాటు సస్పెండ్‌
కర్ణాటక అసెంబ్లీలో రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో సభకు అంతరాయం కలిగించిన 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. వారు సభ నుంచి వెళ్లకపోవడంతో మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించారు. శుక్రవారం కర్ణాటక అసెంబ్లీని రెండు అంశాలు కుదిపేశాయి.  కాంట్రాక్టు పనుల్లో ముస్లింలతో పాటు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించడంతో సభలో గందరగోళం చెలరేగింది.  కాగా, తనపై హనీ ట్రాప్‌ జరిగిందని సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్న అసెంబ్లీలో ఆరోపించారు.  కేంద్ర ప్రముఖులతో సహా 48 మంది వరకు రాజకీయ నేతలు హనీ ట్రాప్‌ బాధితులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే బ్లాక్‌మెయిల్‌, బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిగా ఆరోపించారు.  ఆధారాలు సూచించే సీడీలను చూపుతూ వెల్‌లోకి దూసుకెళ్లారు. వీటిపై దర్యాప్తు జరుపాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు ఈ గందరగోళం మధ్యే ఆర్థిక బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. అయితే నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించినట్లుగా బీజేపీ ఎమ్మెల్యేలు పొరపాటుపడ్డారు. వెల్‌ వద్ద నిరసన చేస్తున్న వారు ఆ బిల్లు ప్రతులను చించివేశారు. స్పీకర్‌ యూటీ ఖాదర్‌ కుర్చీపైకి కాగితాలు విసిరేయడంతో సభలో గందరగోళం తలెత్తింది.

కాగా, సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు. న్యాయ శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ ప్రవేశపెట్టిన ఈ బిల్లును సభ ఆమోదించింది. అయితే సస్పెండైన 18 మంది బీజేపీ సభ్యులు సభ నుంచి వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో మార్షల్స్ సహాయంతో వారిని బలవతంగా ఎత్తుకొని బయటకు తరలించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వథ్ నారాయణ్ కూడా ఉన్నారు.