ముస్లిం కోటా బిల్లుపై రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ

ముస్లిం కోటా బిల్లుపై రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ
హనీ ట్రాప్‌ వ్యవహారం కర్ణాటక అసెంబ్లీని కుదిపేసింది. కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమస్య ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితం కాదని, దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆయన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయాన్ని శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ నేతలు లేవనెత్తారు. హనీట్రాప్‌ వ్యవహారంపై చర్చకు పట్టుబడ్డారు. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా కర్ణాటక ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీంతో సభ రణరంగంగా మారింది.

హనీ ట్రాప్‌పై విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును ప్రవేశ పెట్టడాన్ని విమర్శిస్తూ స్పీకర్‌ చుట్టూ చేరి నిరసన తెలిపారు. తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు ప్రతులను చించి స్పీకర్‌పై వేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ టెండ‌ర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఈ బిల్లును బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

ఇది రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని చెబుతోంది. ప్రభుత్వ టెండ‌ర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు క‌ర్ణాట‌క స‌ర్కారు నిర్ణయం తీసుకున్నది.  ఇందుకోసం రూపొందించిన బిల్లుకు గత వారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. క‌ర్నాట‌క ట్రాన్స్‌ప‌రెన్సీ ఇన్ ప‌బ్లిక్ ప్రొక్యూర్మెంట్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ తీసుకురానున్నారు. కేటీపీపీ చ‌ట్టంలో క్యాట‌గిరీ 2బీ కింద రిజ‌ర్వేష‌న్ విధానాన్ని అమ‌లు చేయ‌నున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామ‌య్య అసెంబ్లీలో ప్రక‌టించారు. 

క్యాట‌గిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటార‌న్నారు. క్యాట‌గిరీ 1 కింద ఎస్సీ, ఎస్టీలు, క్యాట‌గిరీ 2ఏ కింద వెనుక‌బ‌డిన త‌రగ‌తులు వారుంటారు. కేటీపీపీ చ‌ట్టం ప్రకారం క్యాట‌గిరీ 2బీ కింద ఉన్న ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు రూ. 2 కోట్ల మేర ప్రభుత్వ ప‌నులు చేసేందుకు అర్హులు అవుతారు.

బిజెపి ఎమ్మెల్యే భరత్ శెట్టి మాట్లాడుతూ, “హనీ ట్రాప్ కుంభకోణం గురించి చర్చించే బదులు, ముఖ్యమంత్రి నాలుగు శాతం ముస్లిం బిల్లును ప్రవేశ పెట్టడంలో బిజీగా ఉన్నారు. అందుకే మేము నిరసన తెలిపాము. ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా కాగితాలను చించి, పుస్తకాలు విసిరారు. మేము ఎవరికీ హాని చేయలేదు” అని స్పష్టం చేశారు.
 
కాగా, అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లను మైనారిటీలకు సామాజిక న్యాయం, ఆర్థిక అవకాశాలను నిర్ధారించే దిశగా ఒక అడుగుగా సమర్థించగా, ప్రతిపక్ష బిజెపి అది బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది.