* మణిపూర్ లో రాష్ట్రపతి పాలన తర్వాత మెరుగవుతున్న పరిస్థితులు
* ఉత్తర- దక్షణ సమస్య రాజకీయ ప్రేరితం
ఇటీవల ప్రయాగ్‌రాజ్ లో జరిగిన మహాకుంభ్ మొత్తం దేశానికి సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించి, ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే తెలిపారు. బెంగుళూరులో ప్రారంభమైన అఖిల భారత ప్రతినిధి సభ సమావేశాలలో వార్షిక నివేదికను సమ్పరిస్తూ ఈ ప్రత్యేక మహాకుంభ్ భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని అద్భుతంగా చూపించడంతో పాటు మన సమాజంలోని అంతర్గత గొప్పతనాన్ని గ్రహించేలా చేసిందని చెప్పారు.
ఈ భారీ కుంభ్ కోసం సరైన, సున్నితమైన మౌలిక సదుపాయాలు, నిర్వహణ వ్యవస్థను సృష్టించి, నిర్వహించినందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలకు దేశం మొత్తం నుండి అభినందనలు పొందాలని ఆయన పేర్కొన్నారు. మహాకుంభ్ సమయంలో, అనేక సంఘ్ ప్రేరేపిత సంస్థలు వివిధ రకాల సేవా, ధార్మిక, సాంస్కృతిక, విద్యా, సైద్ధాంతిక కార్యక్రమాలను నిర్వహించాయని ఆయన వివరించారు.
సంఘ్ కార్యకర్తల రెండు ప్రత్యేక ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు. సాక్షమ్ నిర్వహించిన నేత్ర కుంభ్, మహకుంభ్ కు వచ్చే ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ, అవసరమైతే కంటిశుక్లం శస్త్రచికిత్సలను ఏర్పాటు చేసింది. సేవా స్ఫూర్తితో అనేక ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, ఇతర సామాజిక సంస్థలు ఈ పనిలో పూర్తి సహకారాన్ని అందించాయి.
ఈ కార్యకలాపానికి సంబంధించిన వివరాలను ఆయన వివరిస్తూ, ఉచిత కంటి పరీక్ష ద్వారా 2,37,964 మంది ప్రయోజనం పొందారని, 1,63,652 మందికి ఉచిత కళ్ళజోడు, 17,069 మందికి ఉచితంగా కంటిశుక్లం శస్త్రచికిత్స జరిగిందని చెప్పారు. 53 రోజుల పాటు జరిగిన ఈ సేవా కార్యక్రమంలో 300 మందికి పైగా కంటి నిపుణులు, 2800 మంది కార్యకర్తలు పనిచేశారని ఆయన తెలిపారు.
దేశంలోని అనేక సంస్థల సహకారంతో పర్యావరణ్ సంరక్షణ్ గతి విధి నిర్వహించిన “ఏక్ థైలా – ఏక్ థాలి ప్రచారం” మరొక ముఖ్యమైన కార్యకలాపం. కుంభ్‌లో థర్మోకోల్ ప్లేట్లు లేదా పాలిథిన్ బ్యాగులను ఉపయోగించకూడదని లక్ష్యంగా చేసుకున్న ఈ ప్రచారం దేశవ్యాప్తంగా స్టీల్ ప్లేట్లు, వస్త్ర సంచుల సేకరణకు దారితీసింది.
కార్యకర్తలు 2241 సంస్థల ద్వారా 7258 కేంద్రాల నుండి మొత్తం 14,17,064 ప్లేట్లు, 13,46,128 బ్యాగులను సేకరించారు, వీటిని కుంభ్‌లోని వివిధ పండళ్లలో పంపిణీ చేశారు. ఈ ప్రచారం ఒక ప్రత్యేకమైన ప్రయోగం పర్యావరణ అవగాహనను సృష్టించడంలో, స్వచ్ఛమైన కుంభమేళా ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలా విజయవంతమైంది.
గత 20 నెలలుగా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్న మణిపూర్ లో రెండు వర్గాల మధ్య విస్తృతమైన హింస సంఘటనల కారణంగా, పరస్పర అపనమ్మకం, శత్రుత్వం తలెత్తాయని హోసబలే విచారం వ్యక్తం చేశారు. ప్రజలు అనేక రకాల కష్టాలను అనుభవించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను తీసుకురావడం సహా రాజకీయ, పరిపాలనా స్థాయిలో తీసుకున్న కార్యాచరణ ఆధారిత నిర్ణయాలు పరిస్థితి మెరుగుదల వైపు ఆశలను రేకెత్తించాయని ఆయన చెప్పారు.
అయితే, సహజమైన స్నేహపూర్వకత, విశ్వాసం ఏర్పడటానికి చాలా సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం కాలంలో, సంఘ్, సంఘ్ ప్రేరేపిత సామాజిక సంస్థలు హింసాకాండ బారిన పడిన ప్రజలకు ఉపశమనం, సహాయాన్ని అందించడానికి కలిసి పనిచేశాయని ఆయన తెలియజేశారు. వారు వివిధ వర్గాలతో నిరంతరం సంబంధాలు కొనసాగించారని, సహనాన్ని కొనసాగించాలనే సందేశాన్ని ఇవ్వడం ద్వారా పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారని చెప్పారు.
సామరస్యం కోసం ఈ ప్రయత్నాలన్నీ ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెబుతూ అయితే చాలా సమయం పడుతుందని స్పష్టం చేశారు. మణిపూర్‌లోని అన్ని వర్గాల వారు తమ బాధను, అపనమ్మకాన్ని పక్కనపెట్టి, పరస్పర సోదరభావంతో సామాజిక ఐక్యత కోసం మరింతగా ప్రయత్నం చేయాలని సంఘ్ హృదయపూర్వక అభ్యర్థన అని తెలిపారు.
మణిపూర్‌లో శాంతిని తీసుకురావడంలో సంఘ్ ప్రయత్నాలపై ఒక ప్రశ్నకు మీడియా సమావేశంలో సహా సర్ కార్యవాహ సి ఆర్ ముకుంద్ సమాధానమిస్తూ, సంఘ్ ప్రయత్నం గిరిజన సమూహాలు, మైటీలు, కుకీల నాయకత్వాన్ని, ప్రజలను ఒకచోట చేర్చి, చర్చించి, ఉమ్మడి అవగాహనకు రావాలని ప్రోత్సహించడమేనని తెలిపారు. సంఘ్ సంఘాలను ఒకచోట చేర్చడం ద్వారా మణిపూర్ ప్రజలకు సహాయం చేస్తుందని చెప్పారు.
“రెండు వర్గాలకు చెందిన చాలా మంది నాయకులు మాతో సంప్రదిస్తున్నారు. సామరస్యాన్ని తీసుకురావడానికి ఇంఫాల్, గౌహతి, ఢిల్లీలలో సమావేశాలు జరిగాయి. సంక్లిష్ట సమస్యకు ఇతర అంశాలు ఉన్నాయి. కానీ సంఘ్ ప్రజలను ప్రభావితం చేయడానికి, కనెక్ట్ చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇంకా, సంఘ స్వయంసేవకులు తమ సొంత ఇళ్ల నుండి విసిరివేయబడిన శరణార్థుల కోసం వందల సంఖ్యలో సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడ ఆహారం, ఆశ్రయం, నిత్యావసరాలు అందిస్తున్నారు”, అని వివరించారు.
ఇలా ఉండగా, భాష, సరిహద్దుల విభజన, ప్రాంతం, ఉత్తర-దక్షిణ విభజన మొదలైన వాటి పేరుతో ఒకటి లేదా మరొక విభజన అజెండాలను ఉపయోగించడం ద్వారా అనేక శక్తులు జాతీయ ఐక్యత, సమగ్రతలకు సవాలు విసురుతున్నాయని దత్తాత్రేయ హోసబలే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, సంఘ్ కార్యకర్తలు, సంఘ్ విచార్ పరివార్‌లోని చాలా మంది, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇటువంటి విభజన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.
ఉత్తర- దక్షిణ విభజనపై ప్రశ్నకు సంబంధించి, చాలా సమస్యలు రాజకీయంగా ప్రేరేపించబడినవని ముకుంద మీడియా సమావేశంలో చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి, హోంమంత్రి స్వయంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్ల నిష్పత్తి ఆధారంగా ఇది జరుగుతుందని చెప్పారని గుర్తు చేశారు. అందువల్ల, దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌కు పెద్దగా చెప్పడానికి ఏమీ లేదని చెప్పారు.
అయితే, రూపాయి చిహ్నాన్ని తొలగించడం, భాషా సమస్యలను లేవనెత్తడం వంటి రాజకీయ ప్రేరేపిత చర్యలను రాజకీయ నాయకులు కాకుండా సామాజిక, సమాజ నాయకులు పరిష్కరించాలని ఆర్‌ఎస్‌ఎస్ విశ్వసిస్తుందని సూచించారు. సంఘ్ న్యాయం కోసం నిలుస్తుందని, అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని నమ్ముతుందని ఆయన పేర్కొన్నారు.
భాషా సమస్యపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, మాతృ భాష విద్యలో మాత్రమే కాకుండా మన దైనందిన జీవితంలోని అన్ని అంశాలలో ఉపయోగించాలని ఆర్‌ఎస్‌ఎస్ విశ్వసిస్తుందని ముకుంద్ స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ మాతృ భాషపై ఒక తీర్మానాన్ని ఆమోదించిందని పేర్కొంటూ బహుళ భాషలు నేర్చుకుంటే అది ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.
మనం నివసించే ప్రదేశానికి చెందిన ప్రాంతీయ భాష అయిన మాతృ భాష, వృత్తిపరమైన ప్రయోజనాల కోసం ఇంగ్లీష్ వంటి కెరీర్ భాష తెలిస్తే అది ఆదర్శం. మన దైనందిన జీవితంలో మాతృ భాష ఉపయోగించాలని సర్ సంఘచాలక్ జీ అధికారిక, అనధికారిక సమావేశాలలో తెలియజేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజలు ఇతర ప్రాంతాల భాషలను కూడా నేర్చుకోవాలని కూడా ఆయన పేర్కొన్నారు.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ