* రాష్ట్రపతి, ప్రధాని, ఇస్రో హర్షం
దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ త్వరలో భారత్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె బంధువు ఒకరు ప్రకటించారు. సునీత సురక్షితంగా భూమిపై అడుగు పెట్టడం వల్ల గుజరాత్‌లోని పూర్వీకుల గ్రామం ఝూలాసన్‌లో ఆమె బంధువులు సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా సునీత బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఆమె త్వరలోనే భారత్‌కు వస్తుందని తెలిపారు. “సునీత కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. ఆమె భూమిపై దిగిన క్షణాలు అపురూపం. అంతా సాఫీగా సాగినందుకు ఆనందంగా ఉంది. ఎలాంటి సవాళ్లనైనా ఆమె ఎదుర్కోగలదు. మా అందరికీ ఆమె ఆదర్శం” అని ఆమె బంధువు పాల్గుణి సంతోషం వ్యక్తం చేశారు.
“ఇప్పుడంతా సునీతకు ఫ్యామిలీ టైమ్. మేమంతా కలిసి వెకేషన్ ప్లాన్ చేస్తున్నాం. సునీత అంతరిక్షంలో ఉన్నప్పుడు కూడా మేం ఆమెతో టచ్‌లోనే ఉన్నాం. ఇటీవల నేను మహాకుంభమేళాకు వెళ్లగా ప్రయాగ్ రాజ్ విశేషాలను ఆ విశేషాలను రోదసి నుంచే అడిగి తెలుసుకున్నారు” అని తెలిపారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత భూమ్మీదకు తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌పై యావత్ ప్రపంచం స్వాగతం పలుకుతోంది. ఈ సందర్భంగా భారత్‌లో రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు, ఇస్రో వ్యోమగాములకు స్వాగతం చెబుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేశారు.
“భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకోవటం చాలా సంతోషం. నాసా వ్యోమగాములు విజయవంతంగా భూమికి చేరటానికి కృషిచేశారు. సునీత, ఇతర వ్యోమగాముల పట్టుదల, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. వారి చారిత్రాత్మక యాత్ర సంకల్పం, టీమ్ వర్క్, అసాధారణ ధైర్యానికి ప్రతీక” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు.
“వెల్‌కమ్ బ్యాక్ సునీత. మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. అయినా సునీతా విలియమ్స్, మిగతా వ్యోమగాములు పట్టుదల అంటే ఏంటో మరోసారి ప్రదర్శించారు. వారి అచంచలమైన సంకల్పం కోట్లాది మందికి స్ఫూర్తి. సునీతతో పాటు మిగిలిన వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన వారిపట్ల గర్వపడుతున్నాం. అభిరుచి, సాంకేతికత కలగలిస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో వారు చూపించారు” అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
“క్రూ డ్రాగన్ సురక్షితంగా భూమిని చేరడం ఆనందంగా ఉంది. భారత పుత్రిక సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములతో కూడిన బృందం అంతరిక్షంలో ఓర్పుతో, పట్టుదలతో సరికొత్త చరిత్రను సృష్టించారు. సునీత అద్భుత ప్రయాణం, అచంచలమైన అంకిత భావం, ధైర్యం, పోరాట పటిమ పలువురికి స్ఫూర్తిదాయకం. ఆమె రాక యావత్ ప్రపంచానికి ఓ వేడుక లాంటి క్షణం. ఆమె విజయాలు మనందరికీ గర్వకారణం. వారిని క్షేమంగా పుడమికి తీసుకొచ్చిన వారందరికీ కృతజ్ఞతలు” అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
“భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు అభినందనలు. అంతరిక్ష కేంద్రం నుంచి 9నెలల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరటం అపూర్వ విజయం. అంతరిక్ష పరిశోధనల విషయంలో నాసా, స్పేస్‌ఎక్స్, అమెరికా నిబద్ధతకు ఈ మిషన్ నిదర్శనం. అంతరిక్ష పరిశోధనల్లో సునీతా విలియమ్స్ అనుభవాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాం” అని ఇస్రో చైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు.
కాగా, ప్రధాని మోదీ సునీతా విలియమ్స్‌ను భారత్‌కు ఆహ్వానించారు. ఈనెల ఒకటో తేదీన రాసిన లేఖను నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినో ద్వారా ఆయన పంపారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా మంగళవారం వెల్లడించారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, తమ మనసులకు ఆమె చాలా దగ్గరగా ఉన్నట్లు ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ